రామగిరి, ఆగస్టు 12: బ్యాంక్ మేనేజర్ తప్పిదంవల్ల రుణమాఫీకి దూరం కావాల్సి వచ్చిందని పెద్దపల్లి జిల్లా రామగిరి మండ లం బేగంపేట కేడీసీసీ బ్యాంక్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గతంలో కేడీసీసీలో పంట రుణం తీసకుకున్న 53 మంది రైతులకు సంబంధించి రూ.1.54 కోట్ల రుణం మాఫీ అయిందని, అదే సమయం లో బ్యాంక్ మేనేజర్ 53 మందికి చెందిన రుణం మాఫీ చేసి రీషెడ్యూల్ చేయాల్సి ఉండగా తమకు తెలియకుండానే రుణం పొందిన ఖాతాలను రద్దు చేసి కొత్త ఖాతాలను తెరవడంతో తమకు రుణమాఫీ వర్తించకుండా పోయిందని వాపోయారు.
ఏడాది గడిచినా రుణమాఫీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ వర్తించకపోవడంతో తమ పట్టా పాసుపుస్తకాలు బ్యాంక్‌లోనే ఉన్నాయని, రుణం చెల్లించాలని తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. సకాలంలో వర్షాలు కురువక బీడువారిన పొలాలు, నష్టాలతో అప్పుల భారంలో ఉన్న సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం అన్యాయమని విమర్శించారు. తక్షణమే రుణమాఫీ అమలుచేసి, వసూలు చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల చివరివారంలో పైస్థాయి బ్యాంక్ అధికారులతో చర్చించి రుణమాఫీ చేస్తామని బ్యాంక్ మేనేజర్ భరోసా ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.