గట్టు/ఇల్లెందు/బజార్హత్నూర్, సెప్టెంబర్ 6 : వ్యవసాయానికి విద్యుత్తు కోతలను నిరసిస్తూ ఆదివారం రైతులు ఆందోళన బాటపట్టారు. లోవోల్టేజ్ సమస్యలతో మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నాయని, కరెంటు ఇవ్వండి సారూ.. అంటూ విద్యుత్తు అధికారులను వేడుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని పోలారం సబ్‌స్టేషన్ వద్ద ఏఐకేఎంఎస్, పీవైఎల్ నాయకులతో కలిసి ఆందోళన చేశారు.
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు సబ్‌స్టేషన్ చేరుకున్న రైతులు విద్యుత్ కోతలతో తాము పడుతున్న ఇబ్బందులను సిబ్బందికి వివరించారు. గట్టు-గద్వాల రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అనంతరం జీఎంపీఎస్ కార్పొరేషన్ చైర్పర్సన్ సరితను కలిసి సమస్యలను వివరించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల రైతులు విద్యుత్తు సరఫరా చేయాలని సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.