బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో సాగునీటికి ఢోకా లేకుండా బతికిన రైతులను కాంగ్రెస్ సర్కారు మళ్లీ రోడ్డు మీదికి తెచ్చింది. వేసిన వానకాలం పంటలు నీళ్లు లేక ఎండిపోయే దుస్థితి దాపురించిందని మండిపడుతూ అన్నదాతలు ధర్నాకు దిగారు. జనగామ మండలం శామీర్‌పేట కాళోజీ సెంటర్ వద్ద సూర్యాపేట-సిద్దిపేట రహదారిపై శనివారం గంటపాటు బైఠాయించి రాస్తారోకో చేశారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి తమకు వెంటనే దేవాదుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తున్నా.. రైతులను పట్టించుకునే నాథుడే లేడు’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
జనగామ, జూలై 12 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లాలో సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. పంటలకు దేవాదుల నీటి విడుదలలో నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. శనివారం సూర్యాపేట-సిద్దిపేట రాష్ట్ర ప్రధాన రహదారిపై జనగామ మండలం శామీర్‌పేట కాళోజీ సెంటర్ వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి గంటపాటు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి జనగామ మండలానికి దేవాదుల నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేలేదని, ఎండిపోతున్న పంటలకు నీళ్లిచ్చి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
కేవలం వర్షాభావం, దేవాదుల నీటిపై ఆధారపడి మాత్రమే పంటలు సాగు చేస్తున్న జనగామ ప్రాంతంలో ప్రస్తుత వానకాలం సీజన్లో సకాలంలో వర్షాలు పడక పంటలు ఎండుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలపై ఆధారపడి వేసుకున్న పంటలు ఎండిపోతుంటే దేవాదుల నీటిని విడుదల చేయాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారని మండిపడ్డారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా గండిరామారం, బొమ్మకూరు, కన్నెబోయినగూడెం, వెల్దండ, లద్నూర్, తపాస్‌పల్లి జనగామ నియోజకవర్గంలోని ఆయకట్టు ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
రిజర్వాయర్లలో నీళ్లున్నా నీటి విడుదల చేయకుండా నిలదీసిన రైతులను అధికారులు బెదిరిస్తూ పీడీ యాక్ట్ పెడుతామని భయాందోళనకు గురిచేస్తన్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వెంటనే నీటిని విడుదల చేయకుంటే బొమ్మకూరు రిజర్వాయర్ గేట్లను తామే ఎత్తి పొలాల్లోకి నీటిని విడుదల చేస్తామని రైతులు హెచ్చరించారు. రైతులకు నీళ్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నదని, పంటలు కాపాడుకునేందుకు తామే గేట్లు ఎత్తుదామంటే కేసులు పెడుతామని అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జనగామ నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లను వెంటనే నింపి రైతులు వేసుకున్న పంటలను కాపాడాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులను కోరారు. కాలికి శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన దేవాదుల నీటి కోసం జనగామ మండలం శామీర్‌పేటలో రైతులు ధర్నా చేసిన విషయం తెలుసుకొని నీటి విడుదలకు వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఫోన్ చేసి కోరారు. రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని, రైతులను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వానకాలం సీజన్లో వేసుకున్న నారు మడులకు ఇంత వరకు నీరు రావడంలేదని, అదనులో వర్షాలు కురవకపోవడం, దేవాదుల రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల జరగపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
జనగామ నియోజక వర్గంలోని రిజర్వాయర్ల నుంచి నీటిని పంపింగ్ చేసేందుకు రెండు పెద్దవి, రెండు చిన్న పంపులు ఉండగా, అందులో పెద్ద పంపు ఒక్కటే ఆన్ చేశారని, చిన్న పంపుల్లో ఒకటి ఆన్ చేసినా ఘన్పూర్ నుంచి ఇక్కడికి వచ్చి సరికే మధ్యలో ఓటీలు ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి నీళ్లు రావడం లేదని తెలిపారు. ఇప్పటికే ఆన్ చేసిన సెవెన్ క్యుమెక్స్ పంపునకు తోడు రెండోది ఆన్ చేయాలని కోరారు. 30 క్యుమెక్స్ నీటిలో 10 క్యుమెక్స్ ఆర్ఎస్ ఘన్‌పూర్‌కు, 2 క్యుమెక్స్ మిషన్ భగీరథకు పోయినా 18 క్యుమెక్స్ నిల్వ సామర్థ్యం నుంచి నీటిని విడుదల చేయాలని సూచించారు. తపాస్‌పల్లికి నీటి విడుదల చేసే పంపు ఆన్ చేసినా, రెండో పంపు ఆన్ చేయకపోతే నియోజకవర్గమంతా గగ్గోలు పెడుతుందని అన్నారు.
బొమ్మకూరు నుంచి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్‌కు నీటిని వదలిపెట్టలేదని, ఇప్పుడు నడుస్తున్న 7 క్యుమెక్స్కు తోపాటు 7 క్యుమెక్స్ పంపు మోటర్‌ను వెంటనే ఆన్ చేస్తే తపాస్పల్లితోపాటు జనగామ ప్రాంతానికి ఇబ్బంది ఉండదన్నారు. వెల్దండ పంపు ఆన్ చేస్తే తపాస్‌పల్లికి నీటి సరఫరా నిలిచిపోయి చేర్యాల ప్రాంతంలో పెద్ద గొడవ జరుగుతుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా గండిరామారం, బొమ్మకూరు, కన్నెబోయినగూడెం, వెల్దండ, లద్నూర్, తపాస్‌పల్లి జనగామ నియోజకవర్గంలోని ఆయకట్టు ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీజన్ ప్రారంభమై నాట్లు ముగింపు దశకు చేరుకొని నీటి కోసం రైతులు తండ్లాడుతుంటే నీటి విడుదల విషయంలో అధికారులకు, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని మండిపడ్డారు.