తురపల్లి, ఏప్రిల్ 30 : ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వ మాజీ విప్, బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా తురపల్లి మండలం ములకలపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం ఎదుట భువనగిరి-గజ్వేల్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, రైతులతో కలిసి దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు.
అంతకుముందు ఆమె కొనుగోలు కేంద్రంలోని రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ.. వారం క్రితం ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఫొటోలకు పోజులిచ్చి వెళ్లారని, నేటికీ కొనుగోళ్లు ప్రారంభం కాలేదని ఆరోపించారు. గత 20 రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గన్నీ బ్యాగులు లేవని సాకులు చెప్పకుండా వెంటనే కొనుగోళ్లు ప్రా రంభించి ధాన్యాన్ని తరలించకపోతే రైతులతో కలిసి ఎమ్మెల్యే ఇంటితోపాటు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా లేదని రైతులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం అయిలాపూర్ గ్రామస్తులు గురువారం రాత్రి నందిపేట్-నవీపేట్ ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.

లారీలు సకాలంలో రాకపోవటంతో తూకం వేసిన ధాన్యం బస్తాలు కల్లాల వద్దే ఉండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి ధాన్యాన్ని సకాలంలో రైస్‌మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు
భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
– నందిపేట్
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో మక్క రైతులు అరిగోస పడుతున్నారు. జిల్లాలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మద్దతు ధరతో కొనుగోళ్లు ప్రారంభించామని అధికారులు చెప్తున్నా, కొనుగోళ్లు జరుగడం లేదు.

పలుచోట్ల పీఏసీఎస్ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించినా, గన్నీ సంచులు లేకపోవడంతో నిలిచాయి. దీంతో రైతులు ఎండలో పడిగాపులు కాస్తున్నారు. ఎండను భరించలేక నీరసించి పోతున్నారు. ప్రభుత్వం స్పందించి మక్క కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
-ఆదిలాబాద్
మక్కజొన్న కాంటా పెట్టడంలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆగ్రహించారు. గురువారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల సమీపంలో మక్కజొన్న లోడ్లతో ఉన్న ట్రాక్టర్లు, వాహనాలతో రోడ్డెక్కారు. తెలంగాణ క్రీడా ప్రాంగణం ఆవరణలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో నిబంధనలు పాటించడం లేదని మండిపడ్డారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. సెంటర్ నిర్వాహకులు రాజకీయ పలుకుబడి ఉన్నవారివే కాంటా పెడుతున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమైన తాగునీరు, నీడ సౌకర్యం, రాత్రివేళ లైట్లు ఏర్పాటుచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై రాజేందర్ ఘటనా స్థలానికి
చేరుకొని రైతులకు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.
– రాయపర్తి