అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 8 : ఉమామహేశ్వర ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అనంతవరం శివారులో రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం ప్రాజెక్టు నిర్మాణ సర్వే పనులను ప్రారంభించడానికి వచ్చిన అధికారులను అనంతవరం, అంబగిరి, బల్మూరు గ్రామాల రైతులు నిలదీశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. రిజర్వాయర్ నిర్మాణంతో రైతులకు లాభంకంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రెండు పంటలు పండించే తాము దాదాపు 2,067 ఎకరాలను కోల్పోయి రోడ్డునపడే ప్రమాదం ఉన్నదని ఆవేదన చెందారు. ఒకవేళ నిర్మిస్తే కేవలం 360 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందే అవకాశం ఉన్నదని తెలిపారు. అందుకే తమ ప్రాణాలు పోయినా పనులను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేసి భూ నిర్వాసితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి.. నేడు కోర్టు ఆర్డర్‌ను ధిక్కరించి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ పనులు ప్రారంభించడం సరికాదని అన్నారు.