కేతేపల్లి, మే 27: అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకంగా మూసీ కుడి కాలువనే పూడ్చివేశారు. ఈ సంఘటనపై రైతులు ఆందోళన చేపట్టడంతో మండలవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని చెర్కుపల్లిలో కృష్ణ సముద్రం చెర్వు ప్రాంతంలోని ప్రభుత్వ భూమి నుంచి మట్టి తరలించేందుకు అధికారులు ఓ కాంట్రాక్టర్కు ఇటీవల అనుమతి ఇచ్చారు.
సంబంధిత కాంట్రాక్టర్ స్థానిక అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి నిబంధలనకు విరుద్ధంగా అక్రమ తవ్వకాలు మొదలు పెట్టాడు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్రదేశంలో కాకుండా తనకు అనువైన ప్రాంతాన్ని సదరు కాంట్రాక్టర్ ఎంచుకున్నాడు. గ్రామానికి ఆయువు పట్టుగా ఉన్న మూసీ కుడికాలువకు అడ్డుగా మట్టి పోసి కార్యకలాపాలు సాగిస్తున్నాడు. దీంతో బుధవారం కాలువకు వరద ప్రవాహం పెరిగి కాలువ నుంచి నీరు రోడ్డు మీదుగా ప్రవహించింది. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు మూసీ కుడి కాలువకు అడ్డుగా పోసిన మట్టిని తొలగించారు.
మూసీ కుడికాలువను మట్టితో పూడ్చివేసి మట్టి ని అక్రమంగా తరలించడాన్ని నిరసిస్తూ బుధవా రం రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మట్టి అక్రమ త వ్వకాన్ని నిలిపి వేయాలని డిమాండ్చేశారు. నిబంధలకు విరుద్ధంగా ఎక్కువలోతులో తవ్వకాలు చేపడుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపో యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే మట్టి తవ్వకాలను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.