గీసుగొండ/ఆదిలాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ) : యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ సొసైటీకి గురువారం ఉదయం 400 యూరియా బస్తాలతో లోడ్ వచ్చిందని తెలియడంతో రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. 200 బస్తాల వరకు టోకెన్లు ఇచ్చి బంద్ చేశారు.
మధ్యాహ్నం తర్వాత మిగతా టోకెన్లు ఇస్తామని చెప్పిన వ్యవసాయ అధికారులు ఇవ్వకుండా వెళ్లిపోయారు. సొసైటీ అధికారులు డైరెక్టర్లకు, వారికి తెలిసిన వాళ్లకు ఇష్టానుసారంగా టోకెన్లు లేకుండానే యూరియా బస్తాలు ఇవ్వడంతో రైతులు అడ్డుకొని 100 నంబర్‌కు ఫోన్ చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యూరియా పంపిణీని నిలిపివేయించారు. 200 బస్తాలు మాత్రమే పంపిణీ చేశారని, మిగతా బస్తాలు ఎక్కడికి పోయాయని రైతులు సొసైటీ అధికారులపై మండిపడ్డారు.