నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 21: పంట పండించేకంటే అమ్ముకునేందుకు ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలన్నర దాటినా కొనే దిక్కులేదని మండిపడుతున్నారు. గన్నీ బ్యాగులు ఇస్తలేరని, కాంటా పెడ్తలేరని ఆవేదన చెందుతున్నారు. లారీలు రాక.. ధాన్యం మిల్లులకు చేరక అవస్థపడుతున్నారు. సర్కార్, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల తీరును నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనాలని సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంతోపాటు మంత్రుల నియోజకవర్గాల్లోనూ రైతులు రోడ్లెక్కుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని మూడు రోజులుగా అన్లోడ్ చేయకుండా అరిగోస పెడుతున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించడం లేదని, 15 రోజులుగా కేంద్రాల వద్దే ఎదురు చూస్తున్నామని రైతులు మండిపడ్డారు. నియోజకవర్గం నుంచి మంత్రి గడ్డం వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నా ఫలితం లేదని రైతులు మండిపడుతున్నారు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం వద్ద జాతీయ రహదారిపై రైతులకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు. రాజీవ్హ్రదారిపై పడుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిల్లర్లు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కోతలు పూర్తయి నెల కావస్తున్నా వడ్లు కొనే దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలను అరికట్టాలని కోరుతూ బీఆర్ఎస్ మండల నాయకుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి, రావులపల్లి గ్రామాల్లోని ఐకేపీ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీ కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెల రోజులు దాటినా వడ్లుకొనే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంటా వేస్తే లారీలు రావు.. లారీలొస్తే మిల్లర్లు దించుకోరని ఆరోపించారు. ధాన్యాన్ని వెంటనే కొనాలని చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం రంగారెడ్డిగూడెం స్టేజీ వద్ద జడ్చర్ల -కోదాడ హైవేపై రైతులు బైఠాయించారు. గుడిపల్లి మండలం కోదండాపురంలోని కేంద్రంలో లారీల కొరతను సాకుగా చూపుతూ ధాన్యం కొనడం లేదని రైతులు వాపోయారు. రోజూ ఐదు లారీల చొప్పున పంపిస్తామని అధికారుల హామీతో రైతులు శాంతించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భవనగిరి జిల్లా వలిగొండలో భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై బీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు, రైతులు మాట్లాడుతూ కొనుగోళ్లు చేపట్టకుండా రైతులను అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు. తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి ఇలాకాలోనూ అంతే..
నెల రోజులైనా ధాన్యం కొంటలేరంటూ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక వర్గంలోని దౌల్తాబాద్ మండలం దేవర్‌ఫసల్‌వాద్‌లో రోడ్డుపై రైతులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమని గర్వంగా చెప్పుకొనే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సాధారణ రైతులను పక్కనబెట్టి బడారైతులు, నాయకులకు చెందిన పంటను కొంటున్నారని మండిపడ్డారు. క్వింటాల్‌కు 9కిలోల వరకు తరుగు తీసి తమ నడ్డివిరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కడుపు మండి వడ్లకు నిప్పు..
వడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యంపై ఓ మహిళా రైతు నిరసన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా ధాన్యం కొనడం లేదని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బాయమ్మపల్లిలో మహిళా రైతు మద్దూరి లలిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. గ్రామంలోని బస్‌స్టాండ్ వద్ద రోడ్డుపై వడ్లను పోసి నిప్పంటించింది. ఆరుగాలం కష్టపడి పంటను పండించినా కొనే దిక్కు లేదని వాపోయింది. నెల రోజులుగా పడిగాపులు పడుతున్నామని ఆవేదన చెందింది. అధికారులు, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల పంటను కొనడం లేదంటూ రైతులు నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం చిట్టంపాడులోని రోడ్డుపై ధాన్యం పోసి నిప్పుపెట్టారు. చిట్టంపాడులోని కేంద్రంలో నెల గడుస్తున్నా ధాన్యం కొనడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తేమ శాతం వచ్చినా కాంటా పెడ్తలేరని మండిపడ్డారు.
సీఎం ఇలాకాలో కొనుగోళ్ల కొట్లాట
నెలరోజులుగా వడ్ల కొనుగోళ్లు చేపట్టక పోవడంపై కొడంగల్ రైతులు ఆందోళనకు దిగారు. గురువారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం దేవర్‌ఫసల్‌వాద్‌లో ధాన్యం లోడుతో ఉన్న ట్రాక్టర్లను రోడ్డుపై నిలిపి ఆందోళన చేపట్టారు.
కొనుగోలు కేంద్రంలో ధాన్యం దగ్ధం

కొనుగోలు కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని ధాన్యం దగ్ధమైన ఘటన ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలో గురువారం చోటుచేసుకున్నది. రైతులు మక్కజొన్న చేలలోని వ్యర్థాలను పోగుచేసి నిప్పంటించారు. ఈ క్రమంలో ఆ మంటలు పక్కనే ఉన్న కొనుగోలు కేంద్రంలోని ధాన్యం బస్తాలకు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రాకపోవడంతో వంద బస్తాల మేర ధాన్యం కాలిపోగా రూ.లక్ష మేరకు నష్టం వాటిల్లింది.
అకాల వర్షానికి తడిసిన ధాన్యం

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి పత్తి మార్కెట్లోని మక్క, వడ్లు పూర్తిగా తడిసిపోయాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మార్కెట్లో 60 వేలకుపైగా మక్క బస్తాలు నిల్వ ఉండగా.. సాయంత్రం వర్షం కురువడంతో చాలావరకు తడిసింది. కొన్ని కుప్పల్లోకి వర్షపునీరు చేరగా.. కొందరు రైతులు సొంతంగా కవర్లు తెచ్చుకొని ధాన్యాన్ని రక్షించుకునేందుకు ప్రయత్నించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వాన నీటిలో కొట్టుకుపోతుంటే కాపాడుకునేందుకు నానాపాట్లు పడ్డారు. – జడ్చర్ల/అచ్చంపేట