శంషాబాద్ రూరల్, జూలై 20 : భూమినే నమ్ముకొన్న బహదూర్‌గూడ రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. బుల్లెట్ ట్రైన్ హబ్ పేరుతో ఇక్కడి అమాయక రైతుల నుంచి 650 ఎకరాల వ్యవసాయ భూములను దౌర్జన్యంగా లాక్కొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. అటు సర్వే పేరుతో అధికారులను, మరోవైపు పోలీసులను ఉసిగొల్పుతుండటంతో వారికి ఇబ్బందులు సృష్టిస్తున్నది. తమ భూములు తీసుకోవద్దని 10రోజుల క్రితం రైతులందరూ దీక్ష చేపట్టగా.. 3రోజుల క్రితం ఆ శాంతియుత నిరసనను సైతం పోలీసులతో భగ్నం చేయించింది. అదే సమయంలో వేలాది మంది పోలీసుల పహారా నడుమ బహదూర్‌గూడ చుట్టుముట్టి సదరు భూమి చుట్టూ కంచె వేయించింది. సర్కార్ కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నదని, భూముల కోసం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నదని ఆవేదన చెందుతున్నారు. తమ భూములు తీసుకొని బతుకులను ఆగం చేయవద్దని రైతాంగం వేడుకుంటున్నది.
మాపై ప్రభుత్వం కక్షగట్టింది..
భూములు తీసుకొని బతుకులు ఆగం చేయొద్దు. రెండు, మూడు రోజుల నుంచి కంటిమీద కునుకు లేదు. శనివారం పొద్దటి నుంచి ఊర్లో ఎక్కడచూసినా పోలీసులే కనిపిస్తున్నరు. ఎవుసం చేసుకొని బతికే మాపై సర్కార్ కక్షగట్టింది. భూములు తీసుకొని అన్యాయం చేయొద్దు.
– మంజుల, మహిళా రైతు, బహదూర్‌గూడ
భూములు పోతే.. మేమేం గావాలె
నాలుగు రోజులుగా నిద్రపట్టడం లేదు. ఆకుకూరలు, పూలు సాగు చేసుకొని భూముల చుట్టూ కంచె వేశారు. మా భూములు తీసుకుంటే మా భవిష్యత్తు ఏమిటి? మేము కష్టపడి సాగుచేసిన గులాబీ పంటలు పనికి రాకుండా పోయాయి. వారం రోజుల నుంచి రోజుకు 50వేలకు పైగా నష్టం వచ్చింది. మా పిల్లల పెండ్లిలు ఎట్ల జెయాలె? మా కుటుంబానికి దిక్కెవరు.
– శంకరయ్య, రైతు, బహదూర్‌గూడ