ఊట్కూర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి నారాయణపేట – కొడంగల్ ప్రాజెక్టు ( Kodangal Project ) లో భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం ఎడవెల్లి గ్రామం నుంచి మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల పాదయాత్ర (Farmers march ) నిర్వహించారు. జిల్లా భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రను బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామోజీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
అఖిలపక్ష నాయకులు నాగురావు నామోజీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, సీపీఎం జిల్లా నాయకులు వెంకట్రావు రెడ్డి, గోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సలీం మాట్లాడారు. భూ నిర్వాసితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన రైతులు 30 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రిగాని, స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రైతుల గోడును పట్టించుకోవడంలేదని విమర్శించారు.
సకలజనుల సమ్మెతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించుకోవడం నారాయణపేట జిల్లా నాయకత్వానికి కొత్త కాదని స్పష్టం చేశారు. భూ నిర్వాసితులను ఆదుకోని పక్షంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎకరాకు రూ.60 లక్షల పరిహారం అందించాలని, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
భూముల వాస్తవ ధరల నిర్ధారణకు కమిటీని నియమించాలని కోరారు. పాదయాత్రలో భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మరాజు గౌడ్, గోపాల్ రెడ్డి, శెట్టి రమేష్, అఖిలపక్ష పార్టీల నాయకులు దొబ్బలి హనుమంతు, ఎం. రఘువీర్ కిరణ్, ఆంజనేయులు గౌడ్, తరుణ్, షేక్ షమీ, రాఘవేందర్ గౌడ్, మల్ రెడ్డి పాల్గొన్నారు.