ఆర్మూర్: ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణాలు మాఫీచేయాలని డిమాండ్ చేస్తూ ఇందూరు రైతాంగం పోరుబాట పట్టింది. ఇచ్చిన మాట ప్రకారం ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మహాధర్నా (Maha Dharna) నిర్వహిస్తున్నారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాకు ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మామిడిపల్లి రోడ్డుపై బైఠాయించారు.
ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ మాఫీచేయాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే ఎకరానికి రూ.7500 చొప్పున రైతు భరోసా నిధులు విడుదల చేయాలన్నారు. రైతు జేఏసీ నిర్వహిస్తున్న ధర్నాకు బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. కాగా, మహాధర్నా నేపథ్యంలో ఆర్మూర్ పట్టణంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. బీఆర్ఎస్తోపాటు విపక్షాలకు నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. రైతులు మామిడిపల్లికి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రైతులు రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 25 వరకు ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్లలో ఆంక్షలు విధించారు.