జిన్నారం/గద్వాల, జూలై 18: రైతు రుణమాఫీ సంబురాలు సంగ్రామాలను తలపించాయి. రైతువేదికల సాక్షిగా ఏసీ(అసలు కాంగ్రెస్) వర్సెస్ వీసీ (వలస కాంగ్రెస్) మాటల యుద్ధం జరిగింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్పల్లిలో గురువారం నిర్వహించిన రుణమాఫీ సంబురాల్లో పటాన్చెరు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు భగ్గుమన్నాయి.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జై కాట శ్రీనివాస్‌గౌడ్.. జై కాంగ్రెస్ అని నినాదా లు చేయడంతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఒకింత అసహనానికి గురయ్యారు. ఎన్నో ఏండ్ల నుంచి కాట శ్రీనివాస్‌గౌడ్ పటాన్చెరు లో కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేస్తుండగా.. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పా ర్టీలో చేరడాన్ని హస్తం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు జో రు అందుకోగా, రైతుకు స్వీటు తినిపించి జి న్నారం మండలంలో గ్రామాల రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్యను మాత్రమే చదివి ఎమ్మెల్యే రెండు నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించారు. కనీసం స్టేజీపై ఉన్న కాంగ్రెస్ నేతలు నీలం మధు, గాలి అనిల్‌కుమార్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పనగేశ్ల పేర్లు కూడా ఉచ్ఛరించకుండానే రుణమాఫీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు.. రైతులకు శుభాకాంక్షలు.. అధికారులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు అంటూ స్టేజీ దిగి వెళ్లిపోయారు.
అంతకుముం దు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు వేసిన కుర్చీలపై ముఖ్య నాయకులతోపాటు మాజీ జడ్పీటీసీ కూర్చోవడం.. మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నిలబడటంతో కార్యక్రమం లో గందరగోళానికి కారణమైంది. పార్టీ కోసం పని చేసిన తాము నిలబడి, ఇప్పుడు వచ్చినవారు కూర్చోడమేమిటి? తామంతా ఎక్కడ కూర్చోవాలి? అని వాదనకు దిగారు. మాజీ జ డ్పీటీసీ కుర్చీలోంచి లేచే వరకూ కాంగ్రెస్ కార్యకర్తలు మొండిపట్టుపట్టారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహ జ్వాలకు కార్యక్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
వాడెవ్వ డు.. వీడెవ్వడు అని కాంగ్రెస్ కార్యకర్త చేసిన నినాదంపై ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. ‘ఏయ్.. తమాషాగా ఉం దా.. అట్ల మాట్లాడితే బాగుండదు.. హా..’ అని ఉరిమి చూస్తూ హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ తగ్గలేదు. దీంతో ఎమ్మెల్యేతోపాటు కూర్చున్న నాయకులందరూ ఒక్కొకరుగా లేచి వేదికపైకి వెళ్లారు. మాజీ జడ్పీటీసీ కే ప్రభాకర్ ఒక్కరే కింద కార్యకర్తలతోపాటు నిలబడ్డారు.
గద్వాలలో ఎవరికి వారే..
గద్వాల కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. గురువారం సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ ప్రకటన చేయడంతో ఉదయమే తన అనుచరులు సంబురాలు చేసుకోవాలని మాజీ జడ్పీచైర్‌పర్సన్ సరిత సూచించడంతో అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్‌తో కలిసి ఎడ్లబండిపై ర్యాలీ చేపట్టి సీఎం రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తర్వాత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ధరూర్‌లో సీఎం చిత్రపటానికి తన అనుచరులతో కలిసి క్షీరాభిషేకం చేసి సంబురాలు చేశారు. ఇలా వేర్వేరుగా సంబురాలు చేసుకోవడం గమనార్హం.