రాష్ట్రమంతటా యాసంగి సాగు జోరుగా సాగుతున్నది. ఈ సీజన్లో మక్కజొన్న, వరి, మిర్చి పంటలు సాగు చేశారు. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సరిపోయినంత స్థాయిలో ఎక్కడా యూరియాను అందుబాటులో ఉంచలేదు. వేల టన్నులు అవసరమైన చోట వందల టన్నులను సరఫరా చేస్తున్నది. దీంతో రైతులు యూరియా కోసం ఇతర మండలాలవైపు పరుగులు తీస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఆదివారం యూరియా వచ్చిందని తెలియగానే రైతులు అక్కడ బారులుతీరారు.
పెద్దవంగర, జనవరి 12 : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని కో-ఆపరేటివ్ రైతుబజార్ ఎదుట ఆదివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. యాసంగి సీజన్లో మకజొన్న, వరి, మిర్చి పంటలు సాగు చేశారు. యూరియా సొసైటీలకు మాత్రమే రావడంతో రైతులు బారులు తీరారు. ప్రైవేట్ షాపుల్లో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇతర మండలాల వైపు పరుగులు తీయాల్సివస్తోంది. అధికారులు స్పందించి రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయాలని కోరారు.
మండలంలో వివిధ పంటల సాగుకు 2200 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 125 మెట్రిక్ టన్నులేనని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. యూరియా కొరతపై వారిని ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా పైవిధంగా సమాధానమిచ్చారు. సొసైటీ కోరిన ప్రకారం విడుతల వారీగా యూరియా వస్తున్నదని వెల్లడించారు.