హైదరాబాద్, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ): రుణమాఫీ కాని రైతులు గురువారం ‘చలో ప్రజాభవన్’కు పిలుపునివ్వడంతో రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రజాభవన్ ముందు పోలీసులను పెద్ద ఎత్తున మోహరించింది. పెద్దపెద్ద బారికేడ్స్, ముళ్లకంచెలు ఏర్పాటు చేసింది.
సీఆర్పీఎఫ్ బలగాలతో రైతులను ఎక్కడికక్కడ అడ్డుకున్నది. కనిపించిన వారిని కనిపించినట్టు అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఉదయమే ప్రజాభవన్‌కు చేరుకున్న రైతులు సాయంత్రం వరకు ముట్టడికి ప్రయత్నించారు. అప్పుడు ఇనుప కంచెల్ని బద్దలు కొట్టానని ప్రకటించావు కదా.. ఇప్పుడు మళ్లీ ఇనుప కంచెలు ఎలా వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డిని రైతులు ప్రశ్నించారు. తమపై నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.