కందుకూరు, మే 16: ఫోర్త్ సిటీ రోడ్డుకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని రాచులూరు రైతులు అధికారులకు తేల్చిచెప్పారు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, భూసేకరణ అధికారి రాజు, తాసిల్దార్ గోపాల్ నిర్వహించిన గ్రామసభలో వారు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఫోర్త్ సిటీ రోడ్డుకు భూములు ఇవ్వాలని అధికారులు కోరడంతో అందుకు రైతులు అంగీకరించలేదు. తామంతా సన్న, చిన్నకారు రైతులమని, తమ భూములు తీసుకుంటే బజారున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో తమ భూములు ఎకరా రూ.5 కోట్లు పలుకుతున్నదని, కావాలనుకుంటే ప్రభుత్వం తమకు ఆ రేటు చెల్లించి తీసుకోవాలని తెలిపారు.
ఒకవేళ అందుకు అంగీరించని పక్షంలో ఎకరాకు రూ.3 కోట్ల చొప్పున చెల్లించి, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని అధికారులను కోరారు. తమ భూములను బలవంతంగా లాక్కుంటే వేరే భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు తమకు ప్రభుత్వం ఎంత నష్టపరిహారం చెల్లిస్తుందో చెప్పకుండా గ్రామసభలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని, తమ భూములపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని రైతులు ప్రశ్నించారు. పోలీస్ బలగాలను మోహరించి తమ భూములను సర్వే చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘మా భూముల వద్దకు వెళ్లే హక్కు మాకు లేదా?’ అని నిలదీశారు. దీంతో అధికారులు కల్పించుకొని ఫోర్త్ సిటీ రోడ్డులో ఎంత మంది రైతుల భూములు పూర్తిగా పోతున్నాయో గుర్తిస్తామని, వారికి ఇచ్చేందుకు వేరేచోట భూములు లేనట్టయితే నష్టపరిహారంతోపాటు కుటుంబంలో 18 ఏండ్ల వయసు నిండినవారు ఎంతమంది ఉంటే అంతమందికి రూ.5.50 లక్షల చొప్పున అదనంగా చెల్లిస్తామని రైతులకు తెలిపారు.