Telangana Floods | సూర్యాపేట, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు గండి పడటానికి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డే కారణమని తెలుస్తున్నది. ఇద్దరు మంత్రులు కలిసి ఈ ఏడాది ఏప్రిల్‌లో దౌర్జన్యంగా ఎడమ కాల్వ ద్వారా ఖమ్మం జిల్లా పాలేరుకు నీటిని తరలించారు. నాడు కనీసం ఒక్క తడికి నీటిని విడుదల చేస్తే పంట చేతికి వస్తదని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయకట్టు రైతులు గగ్గోలు పెట్టారు. ఇదే జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పట్టించుకోలేదు. పైగా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్, ఖమ్మం, వైరా చెరువులకు నీటిని తరలిస్తుంటే నోరుమెదపనే లేదు.
పాలేరుకు నీటిని తరలిస్తుంటే నల్లగొండ జిల్లా రైతులు వాడుకుంటారని ఖమ్మం జిల్లాల మంత్రులు కాల్వల వెంట పోలీసు బందోబస్తు పెట్టడమే కాకుండా కాల్వకు ఉన్న ఎస్కేప్ రెగ్యులేటర్లు, తూముల షటర్లను మూసి మళ్లీ తెరవరాకుండా వెల్డింగ్ చేయించారు. దాని పర్యవసానమే నడిగూడెం వద్ద ఎడమకాల్వకు గండి పడిందని రైతులు భగ్గుమంటున్నారు. మంత్రులు నిర్లక్ష్యం కారణంగానే దాదాపు 700 ఎకరాల్లో పంట నీటి మునిగిందని రైతులు మండిపడుతున్నారు. గత యాసంగి సీజన్లో కాల్వల ద్వారా ఒక్క తడికైనా నీటిని విడుదల చేయాలని రైతులతోపాటు రైతుల పక్షాన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు.
నేరేడుచర్ల, హుజూర్నగర్, పెన్‌పహాడ్ సహా వివిధ మండలాల్లో రైతులు ఆందోళనకు దిగారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా నీరందక సాగర్ ఆయకట్టు పరిధిలో దాదాపు లక్ష ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నీట మునగడం, పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో వేలాది ఎకరాల్లో తీరని నష్టం జరిగింది. దీనికితోడు కాగితరామచంద్రాపురం వద్ద గండి పడి మరో 700 ఎకరాల వరకు నీట మునిగింది.
నాగార్జున సాగర్ ఎడమకాల్వ నీటిని ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు ఒక్కచుక్క నీటిని వాడుకోవద్దనే దురుద్దేశంతో మంత్రులు పొంగులేటి, తుమ్మల పన్నాగం పన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి మూడు, నాలుగు రోజులపాటు సాగర్ ఎడమ కాల్వపై లస్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పోలీసులతో సుమారు 16 మంది బృందంతో ఒక్కో తూము వద్ద భద్రత పెట్టించారు. ఎస్కేప్ రెగ్యులేటర్లు, షటర్లను రైతులు ఎత్తి నీటిని పొలాలకు మళ్లించకుండా వాటికి వెల్డింగ్ చేయించారు. ఇప్పటికీ ఆ వెల్డింగ్ను తొలగించలేదు. సాగర్ ఎడమకాల్వకు నీరు విడుదలవుతున్నా అధికారులు గానీ, మంత్రులు గానీ వాటి గురించే పట్టించుకోలేదు.
ఇటీవల కాల్వ ద్వారా దాదాపు 11 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అదే సమయంలో పాలేరు పూర్తిగా నిండి ఉండటంతో బ్యాక్‌వాటర్‌తో ఎడమకాల్వకు ఒత్తిడి పెరిగింది. దీంతోనే నడిగూడెం మండలం కాగితరామంద్రాపురం వద్ద గండి పడింది. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితారెడ్డి బృందం పరిశీలనలో ఇదే విషయం తేలింది. గండిపడిన ప్రాంతాన్ని వారు మంగళవారం పరిశీలించారు. కాల్వకు గండి ఘటన ప్రకృతి విలయం కాదని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమేనని విమర్శించారు.
కాగితరామచంద్రాపురం రంగుల బ్రిడ్జి వద్ద నాకు మూడు ఎకరాల పొలం ఉన్నది. కాల్వకు రెండు చోట్ల గండి పడటంతో మా పొలాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. అధికారులు ముందస్తుగా ఎస్కేప్‌లు తెరిస్తే ఇంత ప్రమాదం జరిగేది కాదు. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. మా పొలాల నిండా ఇసుక మేటలు వేశాయి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి. మా భూముల్లో ఈ ఏడాది పంట పండే పరిస్థితి ఉండదు.
– నీలకంఠం సీతయ్య, కాగితరామచంద్రాపురం, నడిగూడెం
కాగిత రామచంద్రాపురం రంగుల బ్రిడ్జి వద్ద నాకు, మా కుటుంబ సభ్యులకు ఐదున్నర ఎకరాలు ఉన్నది. సాగర్ ఎడమ కాల్వ తెగడంతో ఆ నీళ్లు మొత్తం మా పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ఇప్పటి వరకు పంట కోసం ఎకరానికి 30 వేలకు పైగా వరకు ఖర్చు చేశాం. 400 ఎకరాలకు పైగా రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ఒక్కో ఎకరానికి నష్టపరిహారం కింద రూ.50 వేల చొప్పున ఇచ్చి ఆదుకోవాలి.
-చక్రాల ఉప్పయ్య, కాగిత రామచంద్రాపురం, నడిగూడెం