హనుమకొండ, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అమలు చేయకపోవడానికి నిరసనగా వరంగల్‌లో బీఆర్ఎస్ చేపడుతున్న రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు మేళా ఏర్పాట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలో వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ కేంద్రం వద్ద నిబంధనలను పట్టించుకోకపోవడం, అధికారులే దగ్గరుండి రైతు మేళా పనులు చేయించడం చర్చనీయాశంగా మారింది. ప్రవేశ, ఉద్యోగ పరీక్షల సెంటర్ సమీపంలో నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిషేధాజ్ఞలు అమలు చేస్తుంది. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఆదివారం నీట్ సెంటర్ ఉన్నది. వరంగల్ పోలీస్ కమిషనర్, జిల్లా అధికార యంత్రాంగం రెండు రోజుల ముందే నీట్ సెంటర్ల వద్ద బీఎన్ఎస్ 163 సెక్షన్ (144 సెక్షన్) విధిస్తూ ఆదేశాలు జారీచేశారు.
హనుమకొండ కలెక్టరేట్‌కు ఆనుకుని ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లోకి ఆదివారం ఉదయం వాకర్స్‌ను సైతం అనుమతించలేదు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష జరిగింది. ఆ సమయంలోనే నిబంధనలను ఉల్లంఘించిన పరిస్థితి నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించనున్న రైతు మేళా ఏర్పాట్లను హడావుడిగా చేపట్టారు. పరీక్ష సమయంలోనూ ఇనుప రాడ్లను పెద్ద శబ్దాలతో కొట్టడం, లారీల నుంచి టెంట్ సామగ్రి, కుర్చీలను దించడం చేశారు. వందల మంది లేబర్, వాహనాల రాకపోకలతో పరీక్ష సమయంలో విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు మేళా ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. అన్ని శాఖల అధికారులకు మేళా నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. జిల్లాలోని అధికార యంత్రాంగం పరీక్ష విషయాన్ని పట్టించుకోకుండా గ్రౌండ్లో ఏర్పాట్లలో నిమగ్నం కావడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పరీక్ష కేంద్రం సమీపంలో నిషేధాజ్ఞలను అమలు చేసే పోలీసు శాఖ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నీట్ అభ్యర్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.