బేల, నవంబర్ 6 : సోయా పంటను(Soya crop) కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. బేల సబ్ మార్కెట్ యార్డుకు రైతులు సోయాను తీసుకురాగా.. అధికారులు కొనుగోళ్లను నిరాకరించడంతో ఆదిలాబాద్ జిల్లా(Adilabad district) బేల మండలంలోని అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వారం రోజులుగా మార్క్ఫెడ్ అధికారులు కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. బుధవారం కొనుగోళ్లను ప్రారంభించగా తేమ పేరిట మళ్లీ కొనుగోళ్లను నిలిపివేయడం విడ్డూరంగా ఉందన్నారు.
రైతులకు అండగా ఉండాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేమ పేరిట రైతులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎలాంటి తేమ శాతం లెక్కించకుండా బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రఘునాథ్రావ్, ఎస్సై రాధిక రైతుల సమస్యలను తెలుసుకుని సంబంధిత మార్కెట్ అధికారులు పిలిపించి వారి సమస్యలు పరిష్కరించారు. దీంతో రైతులు ధర్నాను విరమించగా.. మార్కెట్ యార్డులో సోయా కొనుగోళ్లు యథావిధిగా కొనసాగాయి. ఈ ధర్నాలో రైతులు ఆడె శంకర్, సతీష్ పవార్, ప్రమోద్ రెడ్డి, జక్కుల మధుకర్, గుమ్ముల దశరథ్, వినోద్ పాల్గొన్నారు.