మాగనూరు/కృష్ణ, మే 2 : ధాన్యాన్ని రైస్ మిల్లు యజమానులు దింపుకోవడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మాగనూరు మండలం గుడెబల్లూరులో జాతీయ రహదారిపై ధాన్యం తీసుకువచ్చిన ట్రాక్టర్లను అడ్డుపెట్టి ఆందోళన నిర్వహించారు. మాగనూరు, కృష్ణ మండలాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధికారులు గుడెబల్లూరులోని పారజన్య రైస్‌మిల్లులో దింపాలని సూచించారు. ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు రెండు,మూడు రోజులుగా ధాన్యం ట్రాక్టర్లు నిలుపుకొని మిల్లు వద్దే పడిగాపులు కాస్తున్నా మిల్లు యజమానులు వాటిని దించుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
ఇతర ప్రాంతాల నుంచి లారీల్లో వచ్చిన ధాన్యాన్ని దించుకొని రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని దించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు ట్రాక్టర్లను జాతీయ రహదారిపై అడ్డుపెట్టి నిరసనకు దిగారు. దాదాపు గంటపాటు ఆందోళన నిర్వహించడంతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వెంకటేశ్, ఎస్సై నవీద్, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి అక్కడికి చేరుకొని వారి సమస్యను తెలుసుకున్నారు. పారజన్య రైస్ మిల్లులో దింపుకోవడానికి స్థలం లేకపోవడంతో కృష్ణ మండలం హిందూపూర్ శివారులోని వసుధ రైస్ మిల్లులో ధాన్యం దింపేందుకు ఏర్పాటు చేయడంతో రైతులు ఆందోళన విరమించారు.