వర్ధన్నపేట, జూన్ 6 : నూనెగింజల పంట సాగుతో రైతులకు ఆర్థికంగా మేలు కలుగుతున్నదని వరంగల్ జేడీఏ ఉషాదయాల్ అన్నారు. సోమవారం ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు నూనెగింజల పంటల సాగుపై అధ్యయనానికి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చేరుకొన్నారు. గత యాసంగిలో వరికి బదులుగా నువ్వులు సాగు చేసిన పచ్చిక చెన్నకృష్ణారెడ్డి పంట క్షేత్రంలో పర్యటించి సాగు విధానం, వచ్చిన ఆదాయంపై ఆయన చెప్పిన మాటలన్నీ చిత్రీకరించారు. దీనిపై వారు ప్రత్యేకంగా డాక్యుమెంటరీ రూపొందించనున్నారు. జేడీఏ మాట్లాడుతూ వరి సాగుతో ఆర్థికంగా నష్టం వాటిల్లుతున్నందున రైతులు విధిగా నూనెగింజల సాగు చేయడం మంచిదని సూచించారు. గత యాసంగిలో కృష్ణారెడ్డి నువ్వుల పంట వేసి ఎకరాకు రూ.38వేల వరకు నికర ఆదాయం పొందాడని జేడీఏ వెల్లడించారు.