కందుకూరు, జనవరి 20: ‘ఫోర్త్‌సిటీ రోడ్డుకు ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము. ఒకవేళ బలవంతంగా లాక్కోవాలని చూస్తే ప్రాణాత్యాగాలకైనా సిద్ధమే’ అని బాధిత రైతులు తెగేసి చెప్పారు. ఫోర్త్‌సిటీ రోడ్డు భూసేకరణ కోసం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రాచులూరు గ్రామ పరిధిలోని యాదవరెడ్డి ఫంక్షన్‌హాలులో గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న డిప్యూటీ కలెక్టర్ రాజు, తహసీల్దారు గోపాల్ మాట్లాడారు. ఫోర్త్‌సిటీ రోడ్డు నిర్మాణానికి రైతులు భూములను ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని తెలిపారు. దీంతో రైతు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములను ఇవ్వబోమని స్పష్టంచేశారు. సమాచారం, నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా తమ భూముల్లో సర్వే ఎందుకు నిర్వహించారని రైతులు నిలదీశారు.
మార్కెట్లో తమ భూములు ఎకరాకు రూ.3 కోట్లకు పైగా ధర పలుకుతుందని, ఆ భూములనే నమ్ముకొని తామంతా జీవనం సాగిస్తున్నానమి, ఈ దశలో తమ భూములను లాక్కొంటే ఎలా జీవిస్తామని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.90 లక్షలు ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 330 అడుగుల రోడ్డుకు అంతా వ్యతిరేకమేనని తేల్చిచెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీశైలం, హైదరాబాదు కొత్తూరు జంక్షన్ నుంచి ఫోర్త్‌సిటీ వరకు రోడ్డు ఏర్పాటు చేసిందని తెలిపారు.
ఆ రోడ్డు వెంట వెళ్లడానికి ఏర్పాట్లుచేస్తే ప్రభుత్వానికి రూ.500 కోట్లు మిగులుతాయని, బలవంతంగా తమ భూములను లాక్కోవద్దని హితవు పలికారు. స్వయం గా కలెక్టర్ సమావేశానికి వస్తే రైతుల గోడు విన్నవిస్తామని, ఆయననే రప్పించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. లేదంటే తమకు భూమికి భూమి ఇవ్వాలని పట్టుబట్టారు. రైతుల వాదనలను పైఅధికారుల దృష్టికి తీసుకెళ్త్తామని అధికారులు తెలిపారు. సమావేశంలో ఆర్ఐ యాదగిరి, సీపీఎం మండల కార్యదర్శి బుట్టి బాల్‌రాజ్, రైతులు ఢిలీ గణేశ్ ముదిరాజ్, గుయ్యని సామయ్య, వెదిరె హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.