వికారాబాద్, ఆగస్టు 19, (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షలలోపు రుణమాఫీ పూర్తయిందని చెబుతు న్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉన్నది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు రుణమాఫీ పూర్తైందని ప్ర గాల్భాలు పలుకుతున్నా.. రు ణమాఫీ కోసం రైతులు వ్యవసాయాధికారులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఇలాకాలోనూ రైతులు రుణమాఫీ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని వికారాబాద్ మండలం పెండ్లిమడుగు గ్రామంలో రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న రైతుల్లో 70 శాతం మంది మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామంలో రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న రైతులు 583మంది ఉండగా, వీరిలో 200లలోపు మంది రైతులకే రుణాలు మాఫీ అయ్యాయి. మిగతా రైతులు అర్హులైనా రుణమాఫీకి దూ రం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పెండ్లిమడుగులో రూ.2 లక్షలకుపైన రుణాలున్న రైతులు 20మంది వరకు ఉన్నారు. రేషన్‌కార్డు లేదని, ఆధార్, పట్టాదారు పాసుపుస్తకాల్లో పేర్లు తప్పుగా ఎంట్రీ చేయడంతోనే రుణమాఫీ కాలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నట్టు రైతులు చెబుతున్నారు. వ్యవసాయ కార్యాలయాలకు వెళ్తే వివరాలు తీసుకుంటున్నారే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదని పెండ్లిమడుగు రైతులు పేర్కొంటున్నారు. రేషన్ కార్డు మెలిక పెట్టి తమకు అన్యాయం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాకున్న ఎకరన్నరపై 25 వేల రు ణం తీసుకున్నా. మొదటి విడతలో నే మాఫీ కావాల్సింది. రేషన్‌కార్డు లేక మాఫీ కాలేదు. వ్యవసాయాధికారులను అడిగితే కుటుంబ నిర్ధారణ కాలేదని చెప్పారు. మా అమ్మ, నాన్న పేరిట 2 లక్షల రుణం తీసుకోగా, ప్రస్తుతం 2.03 లక్షలు అయ్యింది. పైన డబ్బు చెల్లిస్తేనే మాఫీ అవుతుందని చెబుతున్నారు.
నాకున్న రెండెకరాల 24 గుంటల భూమిపై రూ.22 వేల రుణం తీసుకున్నాను. కానీ రుణమాఫీ కాలేదు. వ్యవసాయాధికారులను వెళ్లి అడగగా రెన్యూవల్ చేసుకోలేదని సమాధానం చెబుతున్నారు. రెన్యూవల్ చేసుకున్నప్పటికీ సొసైటీ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంతోనే నేను తీసుకున్న రుణం మాఫీ కాలేదు.
కేసీఆర్ ఉన్నప్పుడు రూ.30 వే ల రుణం మాఫీ అయ్యింది. ఏటా రెన్యూవల్ చేసుకోవడంతోపాటు మళ్లీ కొత్తగడి సొ సైటీ బ్యాంకులో 30 వేల రుణం తీసుకున్నా. ఇరవై రోజులుగా ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా. వ్యవసాయాధికారులను అడిగి తే రెన్యూవల్ చేసుకోలేదని సమాధానం చెప్తున్నారు.