సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు రాలేదు. ఏడేండ్లపాటు వచ్చినవి శ్రీరాంసాగర్ నీళ్లే.. ఆ నీటితోనే పంటలు సాగయినయి. గతంలో రాష్ట్రంలో ఎక్కడ పంటలు పండినా కాళేశ్వరం ప్రాజెక్టుతోనే అన్నరు. ఎస్సారెస్పీ కింద పండినా ఇంకెక్కడ పండినా కాళేశ్వరం నీళ్లే అన్నరు. ప్రాజెక్టు కుప్పకూలింది. లక్ష కోట్లు ఆవిరయ్యాయి. కానీ ఈ ఏడాది కాళేశ్వరం లేకుండానే ఒక్క సీజన్లోనే తెలంగాణ రైతులు 2.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిచిండ్రు.
– అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి మా పంటలకు నీళ్లందించిండు. ఎస్సారెస్పీ కాలువల్లో పారింది ముమ్మాటికీ కాళేశ్వరం నీళ్లే. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కనీస అవగాహన లేకుండా రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నడో అర్థమైతలేదు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఈ కాలువలకు నీళ్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఏడేండ్ల సంది పంటలు కోసినంక కూడా వద్దన్నా నీళ్లిచ్చి ఆదుకున్నది ఒక్క కేసీఆరే. మెట్ట భూములు కూడా సస్యశ్యామలంగా మారినయి. ఇప్పుడు నీళ్లు ఇయ్యండి సారూ.. అని మొత్తుకున్నా ప్రాజెక్టుల్లో నీళ్లు ఉంచుకొని కూడా ఇస్తలేరు. వరి పొలాలు మళ్లీ బీడు భూముల్లెక్క మారినయి. మా పొలాలు కనీసం పశువులు మేసేందుకు కూడా పనికిరాకుండా మాడిపోయినయి. రైతుల శాపం కచ్చితంగా తగులుతది. నీళ్లిచ్చుడు చేతగాక సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలాడుతున్నడు. ఇదేం పద్ధతి?
– గోనెల లక్ష్మయ్య, రైతు, వల్లభాపురం, సూర్యాపేట జిల్లా
Kaleshwaram | సూర్యాపేట, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ‘సూర్యాపేటకు కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు రాలేదు.. గత ఏడేండ్లపాటు వచ్చినవి శ్రీరాంసాగర్ నీళ్లే’ అంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల జిల్లా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ‘2018కి ముందు దశాబ్దాల తరబడి నీళ్లు రాలేదు.. కాళేశ్వరం పూర్తయిన తరువాత 2018 నుంచి 2023 వరకు వద్దనేంత వరకు నీళ్లొచ్చాయి. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీళ్లు బంద్ అయ్యాయంటే సూర్యాపేటకు ఏ నీళ్లు వచ్చాయో అర్థమవుద్ది.
అయ్యా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మీరు సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తే వచ్చిన నీళ్లు ఏవో లెక్కలతోసహా చెబుతాం. అప్పుడు సక్కగా అర్థం అవుద్ది’ అంటూ రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలో 2.66 లక్షల ఎకరాల ఎస్సారెస్పీ ఆయకట్టు ఉంటే.. 2018కి ముందు 50 వేల ఎకరాలకు మించి వరి పండలేదని వ్యవసాయ శాఖ లెక్కలు తీస్తే అర్థమవుతుందని రేవంత్‌ను ఉద్దేశించి రైతులు, బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు.
2018 తరువాత నుంచి 2023 వరకు వంద శాతం వరి పండిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత చిన్న సాకు చూపించి కాళేశ్వరాన్ని పండబెడితే యాసంగి పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిజంగా కాళేశ్వరం జలాలు కాకుంటే మరి ఆ పంటలు ఎందుకు ఎండుతున్నాయో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్తారా? లేక ప్రభుత్వం తరఫున ఎవరైనా వచ్చి చెప్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుత సీజన్లో ఎస్సారెస్పీ జలాలు సరిగ్గా రాక 30 వేల ఎకరాల్లో వరి నాట్లు వేయలేదని, గత నెలన్నర రోజుల్లో దాదాపు 65 వేలకుపైనే ఎకరాల్లో వరి ఎండిపోగా పంట చేతికి వచ్చే నాటికి లక్షన్నర ఎకరాలకు చేరుకుంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నట్టు వారు చెప్తున్నారు. నిజంగా కాళేశ్వరం జలాలు సూర్యాపేటకు రాకపోతే పంటలు ఎందుకు ఎండిపోతున్నాయని, రైతుల పట్ల నిజంగా ప్రేమ ఉంటే శ్రీరాంసాగర్ నుంచి నీళ్లు ఇచ్చి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. ముమ్మాటికీ సూర్యాపేటకు వచ్చింది కాళేశ్వరం జలాలేనని, ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి అబద్ధ్దాలు మానుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
‘సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు రాలేదు. గత ఏడేండ్లపాటు వచ్చినవి శ్రీరాంసాగర్ నీళ్లే.. ఆ నీటితోనే పంటలు సాగయ్యాయి.
– అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన
సీఎం రేవంత్‌రెడ్డి సార్.. గతంలో ఎస్సారెస్పీ కాలువలో శ్రీరాంసాగర్ నీళ్లు వచ్చాయని చెప్పారు కదా.. ఆ నీళ్లనే ఇప్పుడు ఇవ్వండి. ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీళ్లు రాక వరి పంట నోటికాడికి వచ్చి ఎండిపోయింది. అప్పుడు వచ్చిన నీళ్లు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. పంట ఎండిపోవడంతో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలుస్తలేదు.
– హలావత్ బిక్యా, రైతు, మోతె మండలం
సూర్యాపేటకు కాళేశ్వరం జలాలు రాలేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు వల్లించారు. గతంలో జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌తోపాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు కూడా అన్నారు. రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటిస్తే పంటలు ఎండిపోతున్న రైతులు ఆయన్ను ఉరికిచ్చి కొడుతారు. ఏడేండ్లు ఎండిపోని పొలాలు నేడు ఎందుకు ఎండుతున్నాయో అసెంబ్లీలో చెప్పాలి. జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతు న్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 2018కి ముందు యాసంగి సీజన్లలో 17 వేల ఎకరాలకు మించి వరి పండించలేదు. 2018 తరువాత 1.27 లక్షల ఎకరాల్లో వరి పండుతుందంటే అవి ఏ నీళ్లో బుద్ధి ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. కాళేశ్వరం జలాలు కాదని నిరూపించేందుకు వరి ఎండకుండా వెంటనే నీటిని విడుదల చేయాలి.
-గాదరి కిశోర్‌కుమార్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే