(మాటేటి వేణుగోపాలరావు)
ఖమ్మం, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ఈ వానకాలం రైతాంగానికి తీవ్ర నిరాశను మిగిల్చేలా కనిపిస్తున్నది. సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా వానలు ముఖం చాటేయడంతో తీవ్ర ఆందోళన నెలకొన్నది. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల్లో చుక్క నీరు కానరాక.. రైతాంగం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. కష్టమో.. నష్టమోనన్న భయాందోళనలోనే నీటి కష్టం తీర్చుకునేందుకు బోర్లు వేయిస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆర్థికంగా తలకు మించిన భారమైనా తప్పని పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తంచేస్తున్నది. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులు ఉన్నా ప్రభుత్వం సరైన విధాన నిర్ణయం తీసుకోకపోవడం, సమగ్ర ప్రణాళిక లేకపోవడం ఈసారి రైతులకు శాపంగా మారింది. రాష్ట్రంలో ఏ జిల్లా చూసినా కరువుఛాయలు కనిపిస్తుండటం, కనుచూపు మేరలో సాగునీరు లభించే పరిస్థితి లేకపోవడం ప్రస్తుత దీనస్థితికి అద్దం పడుతున్నది.
400 నుంచి 600 అడుగులు వేసినా..
ఇక వర్షాలు ముఖం చాటేయడంతో భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం మర్రిగూడేనికి రైతు నాగరాజు తన పొలంలో కొత్త బోరు వేయించాడు. మోటరు, బోరు కేసింగ్ కోసం సుమారు రూ.2 లక్షలు ఖర్చు పెట్టాడు. ప్రస్తుతం ఇదే పరిస్థితి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎదురవుతున్నది. సాగు జలాలను ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా మళ్లిస్తే ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు పుష్కలంగా ఉండేవి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో 400 నుంచి 600 అడుగులు వేసినా బోరులో నీరు పడటం లేదు. ఖమ్మం జిల్లాలోని మధిర, ముదిగొండ, ఎర్రుపాలెం, తల్లాడ, తిరుమలాయపాలెం వంటి మండలాల్లో రైతులు బోర్లు వేయడానికి సంసిద్ధమవుతున్నారు. సాగర్ ఆయకట్టు ప్రాంతం కావడంతో ఈ మండలాల్లో నిరుటి వరకు సాగుజలాలకు ఇబ్బందులు ఉండేది కాదు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మూసాపేట, అడ్డాకుల, దేవరకద్ర, నాగర్‌కర్నూల్ జిల్లాలోని తలకపల్లి, లింగాల, అచ్చంపేట, మిడ్జిల్, నారాయణపేట్ జిల్లాలో దామరగిద్ద, మద్దూరు, మాగనూరు, నర్వ మండలాల్లో కరువుఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 400 అడుగులు బోరు వేస్తే తప్ప భూగర్భంలో జలం కనిపించడం కష్టంగా మారింది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో బోర్లు వేసుకునేందుకు పెద్ద సంఖ్యలో రైతులు పోటీ పడుతుండటంతో బోర్వెల్ యంత్రం కోసం వారం నుంచి పది రోజుల వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది.
ఒక్కో అడుగుకు రూ.100 నుంచి రూ.120
నాగార్జునసాగర్ ఎడమకాలువ ద్వారా ఖమ్మం జిల్లాలో కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, వైరా, మధిర, బోనకల్లు, కల్లూరు, తల్లాడ, పెనుబల్లి, సత్తుపల్లి మండలాల వరకు సాగునీరు అందేది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ప్రాంత రైతులందరూ బోరు బావులపై దృష్టి సారించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందేది. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు నాగార్జునసాగర్ ఎడమకాలువ ద్వారా సాగునీరు సరఫరా అయ్యేది. ఈసారి ప్రాజెక్టులు దాదాపు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో రైతులకు బోర్లే శరణ్యమయ్యాయి. నల్లగొండ జిల్లాలో ఏఎంఆర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులు పూర్తిగా బోర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఆయకట్టు ప్రాంతంలో 400 అడుగుల వరకు బోరు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. ఏటూరునాగారం, మంగపేట, నర్సింహులుపేట ప్రాంతాల్లో సుమారు 2వేల బోర్లు కొత్తగా వేయగా, నల్లగొండ జిల్లాలో 3 వేలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 4 వేల బోర్లకు పైగా కొత్తవి వేశారు. దీంతో రైతన్నపై ఇప్పుడు సాగుకు పెట్టుబడి భారమే కాకుండా, బోర్ల భారం పడుతున్నది. బోరింగ్ పాయింట్ కోసం ఒక్కో చోట అడుగుకు ఒక్కో ధర ఉన్నది. మహబూబ్‌నగర్ జిల్లాలో అడుగుకు రూ.70 ఉండగా, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో రూ.100 నుంచి రూ.120 వరకు నడుస్తున్న ది. మహబూబ్‌నగర్ జిల్లాలోని భీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా నిరుటి వరకు సాగునీరందేది. ఈ ఆయకట్టు రైతులందరూ ఇప్పుడు బోర్లు వేస్తే తప్ప నారుమడి తడిచే పరిస్థితి లేదని వాపోతున్నారు.
అడుగంటిన భూగర్భ జలాలు..
రాష్ట్రంలో సగటు భూగర్భజల మట్టం నిరుడు 6.22 మీటర్లు ఉండగా, ఈ ఏడాది 9.26 మీటర్లకు పడిపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తున్నది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో ఈ నెల 14న రైతు సైదులు తనకున్న రెండున్నర ఎకరాల కోసం ఒకేరోజు మూడు బోర్లు వేసినా అందులో రెండు బోర్లు ఫలితం ఇవ్వలేదు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోనూ రూ.5 లక్షలు వ్యయం చేసి అంగోత్ రాములు ఆరు బోర్లు వేసినా ప్రయోజనం దక్కలేదు. ఖమ్మం జిల్లాలో 5.46 మీటర్ల లోతులో నీరు అందుబాటులో ఉండగా మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఈ నీటిమట్టం 13.30 మీటర్ల లోతుకు పడిపోయింది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో గత జూన్‌తో పోల్చితే నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. రానున్న రెండు నెలలు అత్యంత కీలకం కావడంతో బోర్లు, బావుల కింద పంటలు సాగైతే భూగర్భజలాలు మరింత పడిపోయే ప్రమాదం ఉన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
బోరుకు రూ. 3లక్షలు ఖర్చయ్యింది..
నా పేరు పెద్దారపు నాగరాజు. మాది భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి మర్రిగూడెం గ్రామం. నాకు మూడెకరాల పొలం ఉన్నది. ఈ ఏడాది వానకాలం కలిసొచ్చేలా కనిపించడం లేదు. అధికారులేమో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెబుతున్నరు. ఏ పంట వేసుకున్నా సాగు నీటికి మాత్రం ఇబ్బందులు అయ్యేట్టు ఉన్నది. అందుకే పొలంలో ఈసారి బోరు వేయించిన. రూ. 3లక్షల వరకు ఖర్చయ్యింది. నీరు తక్కువనే పడిందని చెబుతున్నరు. ఇంత ఖర్చుపెట్టి బోరు వేసుకున్నా అసలు కరెంటు ఉంటదనే నమ్మకం లేదు