నీలగిరి, మార్చి 8: నీళ్లు లేక గ్రామాల్లో రైతులు, ప్రజలు అల్లాడుతున్నారు. తాగునీరు ఇచ్చేందుకు బోర్లు, పైపులైన్ల వంటి చిన్న చిన్న మరమ్మతులకు కూడా వీలుకావడం లేదు. సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయని రైతులు ఎక్కడికక్కడ నీలదీస్తున్నారు. రైతులు పురుగుల మందు డబ్బాలతో వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనం ముందుకు వెళ్లలేకపోతున్నాం అంటూ డీఆర్ఎసీ సమావేశంలో నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో జరిగిన డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎదుట ఎమ్మెల్యేలు గగ్గోలు పెట్టారు. డీఆర్సీ సమావేశానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలోని సమస్యలను ఎమ్మెల్యేలు వివరించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నిరుడు ఎండకాలంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ బిల్లులు ఇవ్వలేదని, అద్దెకు తీసుకున్న ట్యాంకర్లు, బోర్లకు డబ్బు చెల్లించలేదని మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ వారితో పనులు ఎలా చేయించాలని ప్రశ్నించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు సుమారు రూ.100 కోట్ల పనులు చేస్తే పైసా ఇవ్వలేదని పేర్కొన్నారు.
కాల్వల్లో చెత్త కూడా తీయలేకపోతున్నాం
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో వేల ఎకరాల్లో వరి పంట ఎండిపోయేటట్టుందని చెప్పారు. గతంలో సమృద్ధిగా సాగునీరు అందేదని, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కాల్వల్లో చెత్తను కూడా తీయలేకపోతున్నామని, దాంతో చివరి భూమలకు నీళ్లు అందడం లేదని వివరించారు. రైతులు మందు డబ్బాలు పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరిస్తున్నారని, బిక్కేరు వాగుకు నీళ్లు విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. రామన్నపేట, నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల్లో నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని, ఆసిఓఫ్నహర్ నుంచి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విన్నవించారు.
5, 10వేల పనులు కూడా చేయలేని దుస్థితి
దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ పూర్తి గిరిజన ప్రాంతమైన దేవరకొండ నియోజవకర్గంలో తాగునీటి సరఫరా సక్రమంగాలేదని చెప్పారు. చాలా గ్రామాలకు బోర్లే ఆధారమని, చిన్న చిన్న రిపేర్లు వచ్చినా సర్పంచ్‌లు లేక పట్టించుకునే వారు కరువయ్యారని తెలిపారు. రూ.5వేలు, రూ.10 వేల పనులు కూడా చేయలేని దుస్థితిలో గ్రామపంచాయతీలు ఉన్నాయని అవేదన వ్యక్తంచేశారు.
రాత్రి కరెంట్ కట్ చేసేందుకు ఆదేశించండి
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మూసీతోపాటు ఇతర కాల్వల్లో గుర్రపు డెక్కను తీయలేని స్థితిలో ఉన్నామని, దీంతో చివరి భూములను నీళ్లు అందడంలేదని పేర్కొన్నారు. పైగా మోటార్లు వేయడం వల్ల నీరు కిందికి వెళ్లడంలేదని, రాత్రి పూట కరెంట్ కట్ చేసేందుకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేల ప్రశ్నలకు వేదిక మీద ఉన్న జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల, జిల్లా మంత్రి కోమటిరెడ్డి కనీసం సమాధానం ఇవ్వలేదు. అధికారులు స్థానికంగా ఉండి పనిచేయాలని చెప్తూ ప్రభుత్వ తరఫున స్పష్టమైన హామీ ఏదీ ఇవ్వకుండానే సమావేశాన్ని ముగించారు. సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతి, కుందూరు జయవీర్‌రెడ్డి పాల్గొన్నారు.