Rythu Runa Mafi | నిజామాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులందరికీ రూ.2లక్షల్లోపు రుణమాఫీ చేశామంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. రైతు సంబురాల్లో భాగంగా ఘనంగా ఈ విషయాన్ని ప్రకటించారు. సీఎం హోదాలో ఈ విషయం చెప్పినప్పటికీ క్షేత్ర స్థాయిలో వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి. వ్యవసాయ శాఖ నిర్వాకం మూలంగా చాలా మందికి రుణమాఫీ కాలేదు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దళిత రైతు రొడ్డ సుమన్ వ్యవహారమే ఉదాహరణ. నాలుగు ఎకరాలు సాగు చేసుకుంటున్న రైతు సుమన్‌ను ప్రభుత్వ ఉద్యోగిగా చూపించి రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టింది. ఈ విషయాన్ని గతంలోనే ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది.
ఆ సమయంలోనే వ్యవసాయ శాఖ కమిషనర్, నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పర్యవేక్షించి, బాధిత రైతుకు న్యాయం చేస్తామని చెప్పారు. నాలుగో విడతలోనూ మాఫీ చేయకుండా దళిత రైతును దగా చేసింది. సాంకేతిక తప్పిదంతో తనకు రావాల్సిన రుణమాఫీని ప్రభుత్వం ఎగ్గొట్టిందని సుమన్ వాపోతున్నాడు.
తనను ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారా.. లేదంటే రుణమాఫీ చేస్తారా? తేల్చాలని డిమాండ్ చేస్తున్నాడు. సుమన్‌కు మాక్లూర్ ఎస్బీఐలో రూ.1,65,220, డీసీసీబీలో రూ.26,801 రుణం ఉంది. మొత్తం రూ.1,92,021 రుణాన్ని తీసుకోగా, వ్యవసాయ శాఖ జారీ చేసిన రైతు సమాచార పత్రంలో రుణమాఫీ స్థితి అని పేర్కొనే 8వ కాలమ్‌లో మినహాయింపు లేని ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు.. అని పేర్కొన్నారు. ఈ తప్పిదమే తనకు రుణమాఫీ వర్తించకుండా చేసిందని రైతు వాపోతున్నాడు.
కుటుంబంలో మినహాయింపులేని ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని పేర్కొంటూ రొడ్డ సుమన్‌కు రుణమాఫీ కాలేదని వెబ్సైట్లో పేర్కొన్న ప్రభుత్వం
రుణమాఫీకి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం బతుకుతున్న. కానీ ప్రభుత్వ ఉద్యోగిగా రికార్డుల్లో ఎక్కించారు. ఇదే తప్పును బూచీగా చూపి నాలుగో విడతలోనూ రుణమాఫీ ఇవ్వకపోవడం అన్యాయం. రుణమాఫీ చేయకపోతే పభుత్వ ఉద్యోగమైనా ఇవ్వాలి.
– రొడ్డ సుమన్, రుణమాఫీ దక్కని దళిత రైతు