తన పేరున తప్పుగా ఎకరం భూమి నమోదు
అసలు పట్టాదారుడికి అప్పగించిన నల్లగొండ రైతు
మునుగోడు, సెప్టెంబర్ 3: అవకాశం దొరికితే పక్కవాడి భూమిని ఎలా ఆక్రమించుకోవాలో ఆలోచించే మనుషులున్న ఈ రోజుల్లో ఓ వ్యక్తి తనది కాని భూమిని అసలు రైతుకు అప్పగించి శభాష్ అనిపించుకున్నాడు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చల్మెడ గ్రామానికి చెందిన వేమిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరుపై గ్రామ శివారులోని సర్వేనంబర్ 168లో ఎకరం భూమి నమోదైంది. ఈ విషయాన్ని గుర్తించిన వెంకట్‌రెడ్డి.. ఒక్క పైసా ఆశించకుండా అసలు పట్టాదారు దొంతరగోని శంకర్‌కు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో శంకర్ పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయించాడు. సాటి రైతు పట్ల వెంకట్‌రెడ్డి చూపిన ఉదారత అభినందనీయమని తాసిల్దార్ శ్రీనివాస్‌లు, జడ్పీటీసీ స్వరూపారాణి ప్రశంసించారు.