మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 29: అప్పుల బాధలు తాళలేక ఓ రైతు తనువు చాలించాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపం చెంది పురుగుల మందు తాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు. ఈ విషాద ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండల శివారులో చోటుచేసుకుంది. మండల పరిధిలోని నడివాడకు చెందిన పెద్దల పాపయ్య (51)కు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది.
అందులో నిరుడు మిర్చి సాగు చేశాడు. పంటకు ముడత, బంక రోగం వచ్చి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఈ సంవత్సరం తన పొలంతోపాటు మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని సొంతంగా మిర్చి నారు పోసి తోట వేశాడు. అందులో కొంత మిర్చి నారు చనిపోయింది. నర్సరీ నుంచి నారు తెచ్చి మళ్లీ వేసినా బతకలేదు.
ఇలా రెండేండ్లుగా పంట పెట్టుబడి ఖర్చులకు రూ.8 లక్షల వరకు అప్పులు చేశాడు. పంటల దిగుబడి రాకపోవడంతో వాటిని ఎలా తీర్చాలని మనస్తాపం చెందాడు. గురువారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స కోసం స్థానికులు ఏరియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.