మహబూబ్ నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో రైతు ప్రభుత్వం కొనసాగుతుందని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం అడ్డాకుల మండలానికి చెందిన ఆరుగురు రైతులకు రూ. 30 లక్షల విలువ గల రైతు బీమా చెక్కులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని అన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, ఉచిత కరెంట్, ఎరువుల పంపిణీ, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాలెన్నో రైతుల కోసం విజయవంతంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే శాఖపూర్ గ్రామంలో రైతు సదస్సు, సాంకేతిక ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు , వ్యవసాయ శాస్త్రవేత్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు ,వ్యవసాయ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. విద్యార్థినులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే పరిశీలించారు.