కాశీబుగ్గ, జనవరి 1: కొత్తగా నిర్మించే బైపాస్ రోడ్డులో భూమి పోతుందనే ఆందోళనతో గుండెపోటు రాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు ఓ రైతు. ఈ ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ప్రతిపాదించిన ఇన్నర్ రింగ్ రోడ్డు కింద రైతుల వ్యవసాయ భూములు పోతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లోని 3వ డివిజన్ ఆరేపల్లికి చెందిన రైతు దయ్యాల రాజ బీరయ్య(73)కు చెందిన ఎకరం ఇరవై గుంటల భూమి ఐఆర్ఆర్ కిందపోతున్నది. తన కుటుంబానికి జీవనాధారమైన పంట భూమి పోతుందని బీరయ్య ఆందోళనకు గురయ్యాడు. ఇటీవల గుండెనొప్పి రాగా హనుమకొండలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా ఆపరేషన్ చేశారు. అయినప్పటికీ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు.