కారేపల్లి, సెప్టెంబర్ 23 : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మంగలితండాకు చెందిన రైతు ధరావత్ పంతులు (52) తనకున్న నాలుగెకరాల్లో పత్తి, వరి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక సోమవారం ఇంటివద్ద పురుగుల మందుతాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఇల్లెందు దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఖమ్మం దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ధరావత్ పంతులుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కారేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.