దిలావర్పూర్, జూలై 22 : అప్పుల బాధ భరించలేక మనస్తాపంతో రైతు కామిండ్ల భీమన్న (40) మంగళవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం మాయాపూర్‌కు చెందిన భీమన్న తన సొంత భూమి అరెకరంతోపాటు మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. అరెకరంలో కూరగాయలు, మూడెకరాల్లో పసుపు, సోయా, పత్తి సాగుచేశాడు. పంట దిగుబడి రాకపోవడంతో పెట్టుబడి డబ్బులు నష్టపోయాడు. ఇటీవల తన కూతురు పెండ్లి కోసం రూ.8 లక్షలు అప్పుచేశాడు.
వడ్డీలు పెరిగి పోతుండటం, పంట దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో మదనపడుతుండేవాడు. సోమవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్లి వస్తానని భార్య సునీతకు చెప్పాడు. రాత్రి వరకు రాకపోవడంతో కుటుంబసభ్యులు చేను వద్దకు వెళ్లి చూడగా పురుగుల మందుతాగి ఉండటాన్ని గమనించారు. వెంటనే నిర్మల్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. భీమన్నకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రవీందర్ తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ఖైరతాబాద్, జూలై 22: ఖైరతాబాద్‌లోని చింతలబస్తీలో ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖైరతాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలబస్తీలో నివాసం ఉండే పులి విమల్‌కుమార్ (55) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు ఆయనను దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.