బోథ్, ఆగస్టు 15 : అప్పుల బాధతో ఓ రైతు పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోథ్ మండలం సాకెర కకు చెందిన జాదవ్ భరత్ (50)కు మూడున్నర ఎకరాలు ఉన్నది. ఇద్దరి కూతుళ్ల పెండ్లిళ్లతోపాటు పంటకు చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురరై గురువారం తన పొలంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు చేను వద్దకు వెళ్లి చూసేసరికి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే బోథ్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భార్య విజయబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని చిన్న వార్తలు
కొనసాగుతున్న సమ్మె
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): కోల్కతాలో వైద్యవిద్యార్థిని హత్యాచార ఘటనపై జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా జూడాలు, రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ల జేఏసీ సమావేశం గురువారం జరిగింది. 72 గంటల్లోగా సీబీఐ అధికారులు ఆర్జీకార్ మెడికల్ కాలేజీపై దాడిచేసిన గూండాలను అదుపులోకి తీసుకోవాలని, హాస్పిటల్, మెడికల్ కాలేజీ ఉన్నతాధికారులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్ డాక్టర్లు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపనున్నట్టు ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ అసోసియేషన్ మెడికల్ టీచర్స్ విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ కిరణ్ మాదాల తెలిపారు.
కాచిగూడ-తిరుపతి మధ్య రైళ్లు రద్దు
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : కాచిగూడ-తిరుపతి, కాకినాడ-సికింద్రాబాద్, నర్సాపూర్-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తున్న ఆరు రైళ్లను రద్దు చేసినట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు. ఈనెల 19 వరకు రైళ్ల రద్దు కొనసాగుతుందని పేర్కొన్నారు.