హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : విధి నిర్వహణలో ప్రమాదానికి గురై కోమా స్థితిలో ఉండి చికిత్స పొందుతున్న ఆక్టోపస్ కానిస్టేబుల్ జీ రజనీకాంత్ కుటుంబానికి ఎస్బీఐ పోలీస్ శాలరీ ప్యాకేజీ కింద రూ.64 లక్షల బీమా పరిహారం మంజూరైంది. బేగంపేటలోని ఆక్టోపస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆపరేషన్స్ డీజీ అనిల్‌కుమార్ చేతుల మీదుగా ఆ నగదు చెకును కానిస్టేబుల్ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు అందజేశారు.
రజనీకాంత్ తండ్రి కొమరయ్య, తల్లి నాగమణి, సోదరుడు నరేశ్, సోదరి శిరీష ఈ చెక్కు అందుకున్నారు. కార్యక్రమంలో ఆక్టోపస్ ఎస్పీ (అడ్మిన్) ఎం వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) బీ రఘునందన్ రావు, ట్రైనింగ్ కన్సల్టెంట్ కల్నల్ భరత్‌ప్రసాద్, డీఎస్పీలు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు నరేందర్ దరి, నందన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.