హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ బతుకమ్మ పండగ ఎంతో ఖ్యాతి పొందిందని, దానిని మరింత పెంచాలని టూరిజం అండ్ కల్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్‌రంజన్ సూచించారు. గతం కంటే ఈ సారి బతుకమ్మ పండుగకు అధిక నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు బుధవారం హరితప్లాజాలో సంబంధితశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. పండగ నిర్వహణ నేపథ్యంలో ఆయాశాఖల అధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం జయేష్‌రంజన్ మాట్లాడుతూ.. సర్కారు నిబంధనలకు లోబడి తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ పండగను నిర్వహించాలని సూచించారు. పండగలో తెలంగాణ కళారూపాలు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ఈ పండుగ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంచేలా ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబాలాదేవి, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, కలెక్టర్ హరిచందన తదితరుఉ పాల్గొన్నారు.