Government Schools | హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ క్రమేణా తగ్గుతున్నది. మూడేండ్లలో ఏకంగా 5 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గారు. గతంలో 25 లక్షలుండగా, ఇప్పుడు 20 లక్షల మందే స్కూళ్లకు వెళ్తున్నారు. ఇందుకు భిన్నంగా టీచర్ల సంఖ్య మాత్రం ఏటా పెరుగుతున్నది. ఇదివరకు 1.12 లక్షల మంది టీచర్లుండగా, ఈ విద్యాసంవత్సరంలో 1.13 లక్షలకు చేరారు.
తాజా డీఎస్సీ-2024లో భాగంగా దాదాపు 10 వేల టీచర్ పోస్టులను భర్తీచేశారు. డీఎస్సీ-2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వనుండడంతో మరో 1,450కి పైగా కొత్తటీచర్లు రానున్నారు. డీఎస్సీ-24లో పెండింగ్ 1,056 పోస్టులు సైతం భర్తీకానున్నాయి. ఇవన్నీ కలిపితే రాష్ట్రంలో మొత్తం టీచర్ల సంఖ్య 1.25 లక్షలకు చేరనున్నది. ఒకవైపు టీచర్ల సంఖ్య పెరుగుతుండ గా, మరోవైపు విద్యార్థుల సంఖ్య తగ్గుతుండటంతో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి పడిపోతున్నది.
విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 1:30 ఉండాల్సి ఉండగా,డీఎస్సీ-2024, డీఎస్సీ-2008 నియామకాలు కలుపుకుంటే 1:10కి చేరనున్నది. అయితే విద్యార్థుల సంఖ్య నమోదుపై విద్యాశాఖ దృష్టి పెట్టడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం బడిబాట మినహా నామమాత్రపు చర్యలకే పరిమితమవుతున్నది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో పాఠశాల విద్య తీవ్ర సంక్షోభంలోకి వెళ్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత జూన్లో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య 20.75 లక్షలు ఉండగా, సెప్టెంబర్ నాటికి 20.68 లక్షలకు పడిపోయింది. ఇదే జూన్లో ప్రైవేట్లో 33.87లక్షలు ఉండగా, సెప్టెంబర్ నాటికి 34.05 లక్షలకు పెరిగింది.
స్కూళ్లల్లో విద్యార్థులు, టీచర్ల పరిస్థితి..
కొత్త డీఎస్సీ కష్టమే..
పరిస్థితి ఇలా ఉంటే కొత్త డీఎస్సీ కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో పాఠశాల విద్యాశాఖలో 25 వేల టీచర్ పోస్టులను భర్తీచేస్తామని హామీ ఇచ్చింది. వీటిలో తాజాగా భర్తీచేసిన 11వేలు మినహాయిస్తే మరో 14వేల పోస్టులను భర్తీచేయాల్సి ఉంది. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి తక్కువగా ఉండటంతో రేషనలైజేషన్ చేయాలని కేంద్రం ఆదేశాలిస్తున్నది.ఈ నేపథ్యంలో కొత్త డీఎస్సీ ఎలా సాధ్యమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.