Rain | అయిజ/వడ్డేపల్లి/ఖలీల్వాడి/కంఠేశ్వర్, సెప్టెంబర్ 4 : జోగుళాంబ గద్వాల, నిజామాబాద్ జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి వాన దంచికొట్టింది. భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అయిజ, వడ్డేపల్లిలో, నిజామాబాద్ శివారులోని మాలపల్లి, ఆటోనగర్లో ఇండ్లలోకి నీళ్లు చేరాయి. అయిజ-ఎమ్మిగనూరు అంతర్రాష్ట్ర రహదారి డైవర్షన్ కొట్టుకుపోయింది. ఖానాపూర్, మానిక్ బండార్, రేడియోస్టేషన్ ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. ఖానాపూర్కు వెళ్లే రోడ్డుపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మానిక్భండార్ వద్ద నిజామాబాద్-ఆర్మూర్ ప్రధాన రహదారిపై భారీగా వరద చేరడంతో అధికారులు వాహనాలను మళ్లించారు. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 6.11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా డొంకేశ్వర్లో 16.23 వర్షపాతం నమోదైంది.
ములుగు రూరల్ : ములుగు జిల్లా ములుగు మండలం భూపాలనగర్(పందికుంట) గ్రామం లో ఇంటి గోడ కూలి వృద్ధురాలు మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామానికి చెందిన సున్నం ఆగమ్మ (75)ఇంటి గోడలు నానిపోయాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంటి గోడ కూలి మీద పడడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఆగమ్మ ఒంటరిగానే ఇంట్లో ఉంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
శ్రీశైలం, సెప్టెంబర్ 4 : శ్రీశైలం డ్యాం జెన్కో కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో శబ్దం వచ్చింది. దీనిపై చీఫ్ ఇంజినీర్ కాంతారావు స్పందిస్తూ మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో 7వ నెంబర్ జనరేటర్లో సాంకేతిక సమస్య తలెత్తి స్పార్క్ ఏర్పడినట్లు తెలిపారు. వెంటనే సమస్యను పరిష్కరించామని, ప్రస్తుతం ఆ జనరేటర్తోపాటు మిగతా ఆరు జనరేటర్ల ద్వారా విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మొద్దని సీఈ సూచించారు.