ములుగు, అక్టోబర్ 24 (నమస్తేతెలంగాణ): ములుగు జిల్లాలో జరిగిన నకిలీ పోడు భూముల పట్టాల దందా ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడమే లక్ష్యంగా సాగిందని ములుగు డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. తమ దర్యాప్తులో పట్టుబడిన ఐదుగురు వ్యక్తులను ప్రాథమిక విచారణ అనంతరం పోలీస్ శాఖకు అప్పగించనున్నట్టు పేర్కొన్నారు. ములుగు మండలం కాసిందేవిపేట కేంద్రంగా జరిగిన నకిలీ పోడు పట్టాల తయారీ దందాలో ముఠా సభ్యులైన నలుగురిని గురువారం ఫారెస్టు కార్యాలయంలో అరెస్టు చూపించారు. అనంతరం డీఎఫ్‌వో మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముగ్ధుంపురం గ్రామానికి చెందిన చందావత్ భద్రు, నెక్కొండ మండలం అమినాబాద్కు చెందిన భూక్యా వెంకన్న, వరంగల్‌లోని గణేశ్ ప్రింటర్స్ యజమాని తాటిపాముల రాజు, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ఇంచెంచెర్వుపల్లికి చెందిన జాటోత్ రాజ్‌కుమార్ నకిలీ పట్టాల దందాను చేపట్టారని, వీరికి కాసిందేవిపేటకు చెందిన వాంకుడోతు రవి డబ్బులను సమకూర్చడం, పట్టాలను విక్రయించడం చేశాడని తెలిపారు.