హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఇటీవల అతిపెద్ద నకిలీ పాస్‌పోర్టు రాకెట్‌ను చేధించిన తెలంగాణ సీఐడీ పోలీసులు.. బోగస్ పత్రాలతో విదేశాలకు వెళ్లిన 92పై దృష్టి సారించారు. మరోవైపు ప్రాథమిక విచారణలోనే 92 మందికి నకిలీ పాస్‌పోర్టులు అందించినట్టు వెల్లడించిన నిందితులు.. పూర్తిస్థాయి విచారణలో ఇంకా ఎన్ని పేర్లు బయటపెడతారోనన్న ఉత్కంఠ నెలకొంది. నకిలీ పాస్‌పోర్టులు పొందినవారు దేశంలోనే ఉన్నారా? లేక విదేశాలకు వెళ్లారా? ప్రస్తుతం వీరు ఎక్కడైనా పనిచేస్తున్నారా? లేక ఉగ్రవాద సంస్థల్లో చేరారా? అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతున్నది. పాస్‌పోర్టు ఏజెంట్లు ఈసీఎన్ఆర్ క్యాటరిగీలో దరఖాస్తు చేయడం కస్టమర్ల ఫోన్ నంబర్లకు బదులుగా తమ ఫోన్ నంబర్లను ఇవ్వడంతో దర్యాప్తు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో నకిలీ పత్రాలతో పాస్‌పోర్టులు పొందినవారిని పట్టుకోవడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాసుల కక్కుర్తితో ఎస్బీకి అప్రతిష్ట..
దొంగలతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కుమ్మక్కు అయ్యారనే విషయంపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు చాలా సీరియస్‌గా ఉన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులు అంతర్గత విచారణకు ఆదేశించడంతో, సదరు ఎస్బీ అధికారుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టినట్లు తెలిసింది. రాష్ట్రంలో సగటున రోజుకు 3 వేల మందికిపైగా పాస్‌పోర్టు పొందేందుకు దరఖాస్తు చేస్తున్న క్రమంలో ఎస్బీ విచారణ వ్యవస్థపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసు కస్టడీతోనే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.