హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): సచివాలయానికి నకిలీ ఉద్యోగుల తాకిడి ఎక్కువైంది. తాజాగా ఓ నకిలీ ఉద్యోగిని సచివాలయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అత్తాపూర్‌కు చెందిన సమీర్ కారుకు ‘టీజీ సెక్రటేరియట్.. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ అనే స్టిక్కర్ అతికించుకుని సచివాలయంలోకి ప్రవేశించాడు. అతని తీరుపై అనుమానం వచ్చి అడ్డగించడంతో.. తాను ప్రభుత్వ ఉద్యోగినంటూ దబాయించాడు. అనంతరం సెక్రటేరియట్ సీఎస్‌వో ఆదేశాల మేరకు ఎస్సై వెంకటేశ్వరరావు విచారణ చేపట్టడంతో అసలు విషయం బట్టబయలైంది. తన భార్య మాలతి సెక్రటేరియట్లో అవుట్సోర్సింగ్ అటెండర్‌గా పనిచేస్తున్నదని, ఆమెను కలిసేందుకు వచ్చినట్టు సమీర్ చెప్పాడు. కారుకు స్టిక్కర్ వేసుకుని సచివాలయంలోకి ప్రవేశించడంపై ఎస్సై వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
రైతులకు రూ. 20వేల నష్టపరిహారం ఇవ్వాలి ; తెలంగాణ రైతు సంఘం డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : అకాల వర్షాలు, వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేల నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు, ప్రధాన కార్యదర్శి టీ సాగర్ డిమాండ్ చేశారు. శనివారం వారు ప్రకటన విడుదల చేశారు. 20 రోజుల నుంచి అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా వేలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆహార పంటలకు ఎకరాకు రూ.20వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.40వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. యాసంగి పంటలు కోతకు వచ్చే తరుణంలో 20 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వాపోయారు. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు పడే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ ప్రకటించిందని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.