హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): నిద్రమత్తు వదులుతుందని కొందరు, ఉత్సాహం పెరుగుతుందని ఇంకొందరు చాయ్ డికాక్షన్ తాగుతారు. కానీ, ఇక్కడ ఓ ముఠా మాత్రం చాయ్ డికాక్షన్ సాయంతో నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టిస్తున్నది. తెల్ల కాగితాలను డికాక్షన్లో ముంచి 20 ఏండ్ల కిందటి పాత రిజిస్ట్రేషన్ పత్రాల్లా రంగుమార్చి అమాయకులకు అంటగడుతున్నది. ఫొటో రిజిస్ట్రేషన్ పద్ధతి కంటే ముందు.. పేర్లతో రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లనే టార్గెట్ చేస్తున్నది. ముఠా సభ్యులు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తిరుగుతూ ఖాళీ స్థలాల వివరాలు, వాటి రిజిస్ట్రేషన్ తేదీలను సేకరిస్తారు. ఆ ప్లాట్ల పత్రాల సీసీ కాపీలు లేదా జిరాక్స్ పత్రాలను సంపాదిస్తారు. ఒరిజినల్ పత్రాలను తలపించేలా వాటిని తయారు చేసేందుకు ప్రింటర్, జిరాక్స్ మెషిన్, డికాక్షన్.. ఇలా మొత్తం 22 రకాల సామగ్రిని సేకరించారు. తెల్ల కాగితాలను డికాక్షన్లో ముంచి ఆరబెట్టి.. పాత సేల్‌డీడ్ ఉండే రంగులోకి మార్చుతారు. ఆయా సంవత్సరాల బాండ్ పేపర్ల ముద్రలను కలర్ జిరాక్స్ తీసి.. రంగు మార్చిన పేపర్‌పై అతికిస్తున్నారు. సేల్‌డీడ్ పూర్తి వివరాలను ముద్రిస్తున్నారు. నకిలీ స్టాంప్‌లను తయారుచేసి అసలును తలపించేలా ఆ పత్రాలపై దించేస్తారు. సాధన చేసి మరీ నకిలీ సంతకాలు చేస్తారు. ఇటీవల రాచకొండ ఎస్వోటీ, బాలాపూర్ పోలీసులు ఒక ఇంట్లో సోదాలు జరిపి నకిలీ పత్రాలు సృష్టిస్తున్న కడియం దయాకర్, సందీప్, వల్లల ప్రేమ్‌కుమార్, వెంకట్‌రెడ్డిని అరెస్టు చేశారు. నకిలీపత్రాలు తయారుచేస్తున్న విధానాన్ని చూసి కంగుతున్నారు. ప్రధాన నిందితులు ప్రేమ్‌కుమార్, దయాకర్.. ఇలా నకిలీ పత్రాలు సృష్టించి చాలామందికి రూ.కోట్లలో ఎగనామం పెట్టారని తెలిసింది. వీరిపై రాచకొండ, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 11 కేసులు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది.
సగం ధరకే అమ్ముతామని మోసాలు
‘మా కుటుంబసభ్యులు గతంలో కొన్నారు. ఇప్పుడు డబ్బు అవసరమైంది. అక్కడ ధర గజానికి రూ.20 వేలు నడుస్తున్నది. మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుంటే సగం ధరకే అమ్మేస్తా’ అంటూ నకిలీ పత్రాలతో ముఠా సభ్యులు అమాయకులను నమ్మిస్తారు. ఇ తరులను కమీషన్‌కు మాట్లాడుకొని.. వారి ఫొటోలతో రిజిస్ట్రేషన్ చేస్తారు. పొజిషన్లోకి వెళ్లినప్పుడు.. అసలు యజమాని వస్తుండటంతో నకిలీ బాగోతం బయటపడుతున్నది. ఈ ముఠా తాజాగా ఆదిబట్లలో ఒక ప్లాటును 50 లక్షలకు విక్రయించి.. మోసం చేసింది.