హైదరాబాద్, మే 04, (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి తప్పించుకొనేందుకు ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ పేరిట కొందరు కేటుగాళ్లు ఫోన్లు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సైబర్ క్రైం విభాగం హెచ్చరించింది. ఈ నకిలీలు తమను తాము ప్రభుత్వ సిబ్బందిగా, పలు వ్యాక్సిన్ కంపెనీల ప్రతినిధులుగా, డీలర్లుగా చెప్పుకొంటున్నారు. వారు ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా లింక్‌లు పంపి వివరాలు సేకరిస్తున్నట్టు అధికారులు హెచ్చరించారు. వ్యాక్సినేషన్ కోసం కేవలం https:// cowin.gov.in, లేదాumang App లేదా ఆరోగ్యసేతు యాప్‌లో మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
చారిటీల పేరిట మోసాలు
కొవిడ్-19తో బాధపడుతున్న సాటివారికి సాయం చేసేందుకు ఎంతోమంది ముందుకు వస్తున్నారు. తమకు తోచినంతలో పక్కవారికి సాయపడాలన్న మంచి ఆలోచనను కూడా సైబర్ కేటుగాళ్లు తమ కాసుల కక్కుర్తికి వాడుతున్నట్టు కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. చారిటీల పేరిట ఫిషింగ్ ఈ-మెయిల్స్, సోషల్ మీడియా పోస్టులతో గూగుల్‌పే, ఫోన్‌పే నంబర్లు ఇవ్వడం, క్రౌడ్ ఫండింగ్, ఫోన్‌కాల్స్ ద్వారా డబ్బులు పంపాలని కోర డం వంటివి చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి కాల్స్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది. డొనేషన్లు ఇచ్చే సమయంలో సంస్థ పేరు.. ఇతర వివరాలు పరిశీలించాలని సూచించింది. వీలైనంత వరకు వ్యక్తిగతంగా విరాళాలు ఇవ్వాలని తెలిపింది.