హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వం నిర్ణయిస్తే… జలమండలి ముందుగా కనీస బాధ్యతగా చేపట్టాల్సింది… ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ నిర్ధారణ. ఆ మేరకు క్షేత్రస్థాయిలో హద్దు రాళ్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. అప్పుడు హైడ్రా రంగంలోకి దిగి వాటి పరిధిలో ఉన్న వాటిని రాజకీయాలకు అతీతంగా నేలమట్టం చేయాలి.
కానీ గండిపేట పరిధిలో కేవలం ఏడు నిర్మాణాలను మాత్రమే ఎందుకు కూల్చారు? వీటిని కూల్చాలని, అవి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని నిర్ధారించింది ఎవరు? ఆ బాధ్యత జలమండలిదే అయినందున అధికారులు మిగిలిన వాటిని ఎందుకు విస్మరించారు? ముఖ్యంగా గతంలో అనేకసార్లు జలమండలి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై సర్వే చేసింది.
ప్రముఖుల ఫాంహౌస్‌లు ఉన్నాయని కూడా గుర్తించింది. అదే నివేదికను హైడ్రా ముందు ఉంచితే సరిపోతుంది కదా. దానిని అటకెక్కించి ఈ ఏడు నిర్మాణాలను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? ఒకవేళ అవి ఇప్పుడు నిర్మాణమైనందున అని అధికారులు సమర్ధించుకున్నా… అప్పోజిగూడలో నిర్మాణ దశలో ఉన్నవి కూడా ఉన్నాయి. వాటిపై ఎందుకు శీతకన్ను ప్రదర్శించారు? ఇలా అనేక సందేహాలు, అనుమానాలకు అటు హైడ్రా, ఇటు జలమండలి… వీరికి మించి రేవంత్ సర్కారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరముంది.
జంట జలాశయాల నుంచి నీటి విడుదలలోనూ హైడ్రామా చోటుచేసుకుంటుందని స్థానికులు చెబుతున్నారు. జలాశయాల్లో ఏస్థాయిలో ఎంత నీటిమట్టం వస్తే ఏ ప్రముఖుడి గెస్ట్‌హౌస్ కిందకు నీళ్లొస్తాయనే వివరాలూ జలమండలి యంత్రాంగానికి తెలుసునని స్థానికుడు ఒకరు తెలిపారు. అందుకే చాలా సందర్భాల్లో పూర్తిస్థాయి నీటి నిల్వ రాకుండానే ఎగువ నుంచి భారీ వరద వస్తుందంటూ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తారనే ఆరోపణలు కూడా స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
లోతుగా పరిశీలిస్తే… జలాశయాల్లో భారీ ఎత్తున పూడిక పేరుకుపోయింది. దీంతో జలాశయాల్లోకి ఎఫ్టీఎల్ స్థాయిలో నీళ్లు వచ్చినట్లు బండ్ వద్ద సాంకేతికంగా కొలత చూపినా… అందుకు అనుగుణంగా జలాశయంలో వరద (ఫోర్‌షోర్ పరిధి నిర్ధారణ మేరకు ఉండదు) పరుచుకోదు.
ఇది కూడా యంత్రాంగానికి ఒక వరంగా మారిందంటున్నారు. దీనికి తోడు ఆక్రమణల సందర్భంగా ఏడెనిమిది అడుగుల మేర మట్టి నింపడం కూడా బండ్ దగ్గర ఎఫ్టీఎల్ మేర నీటి నిల్వ లేకున్నా సాంకేతికంగా నీటిమట్టం పెరిగినట్లు కనిపిస్తుందని చెబుతున్నారు. ఇలా జలాశయాల నిర్వహణ, సాంకేతిక అంశాల్లో అనేక లోపాలు ఉన్నాయి.
ఇవన్నీ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ నిర్ధారణపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే గతంలో నిర్ధారణ జరిగిన ఎఫ్టీఎల్కు ఇప్పుడున్న క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య తేడాలు ఉన్నాయని రిటైర్డ్ ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు.