హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఇంటర్ బోర్డు రద్దు కానుందా? ఈ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయబోతున్నారా? అంటే అధ్యాపక సంఘాలు అవుననే అంటున్నాయి. ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను రద్దు చేయడం. కొత్త సంస్కరణలు.. మార్గదర్శకాల వెనుక ఆంతర్యమిదేనని అధ్యాపక సంఘాల నేతలు అనుమానిస్తున్నారు. మొత్తంగా ఇంటర్‌బోర్డును రద్దు చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఈ నెల 4న ఇంటర్‌బోర్డు అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలయ్యింది. మే 5న ఈ షెడ్యూల్‌ను బోర్డు రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అడ్మిషన్లు నిర్వహించరాదని స్పష్టం చేసింది. విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణల కోసం కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని, త్వరలోనే సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బోర్డు మనుగడపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్‌బోర్డు ఉద్యోగుల్లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా పలు అధ్యాపక సంఘాలు సర్కారుపై మండిపడ్డాయి. సర్కారు తీరు చూస్తుంటే బోర్డును రద్దు చేయడం ఖాయంగా కనిపిస్తున్నదని అంటున్నాయి. పీవీ నర్సింహారావు ప్రారంభించిన ఇంటర్ విద్యను నిర్వీర్యం చేయడం తగదని చెబుతున్నాయి. అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులెవరూ కోరకుండానే బోర్డును రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి.
రాష్ట్రంలో వేర్వేరు బోర్డులెందుకని కొంతకాలంగా రాష్ర్ర్టాన్ని కేంద్రం ప్రశ్నిస్తున్నది. రెండు బోర్డులను విలీనం చేయాలని సూచిస్తున్నది. తెలంగాణ విద్యాకమిషన్ సైతం ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయాలని సర్కారుకు సిఫారసు చేసింది. రెండింటిని విలీనం చేసి తెలంగాణ పాఠశాల విద్యాబోర్డు (టీజీఎస్ఈబీ)ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. కొంతకాలం క్రితం ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఇంటర్ విద్యను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతంలోని స్కూళ్లల్లో ఇంటర్ విద్యను ప్రారంభిస్తామన్నారు. మొత్తంగా చూస్తుంటే ఇంటర్ బోర్డు రద్దు దిశగానే సర్కారు అడుగులు పడుతున్నట్టు అధ్యాపక సంఘాల నేతలు అనుమానిస్తున్నారు. ఇదే అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. బుధవారం కొందరు విద్యాశాఖ ఉన్నతాధికారులు యాక్ట్ -2, 1971 చట్టాన్ని సవరించే అంశంపై న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతున్నది. దీనిపై ఆరా తీసేందుకు విద్యాశాఖ ఇన్చార్జి కార్యదర్శి శ్రీదేవసేనను ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో సంప్రదించగా ఆమె స్పందించలేదు.
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసి, ఆకస్మాత్తుగా రద్దు చేయడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై స్పష్టతనివ్వాలి. నిరుటిలాగే ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్‌ను ప్రకటించాలి. విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలి. బోర్డు విలీనంపై అందర్ని సంప్రదించి, అభిప్రాయాలు సేకరించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
ఇంటర్ బోర్డును రద్దు చేయాలనుకోవడం దుర్మార్గం. అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారి, విద్యా కమిషన్ కలిసి విద్యా వ్యవస్థను బొంద పెట్టాలని చూస్తున్నరు. రాష్ట్ర ప్రభుత్వ తీరు తుగ్లక్ చర్యలా ఉన్నది. రద్దు చేయాలన్న ఆలోచన తప్పుడు నిర్ణయం. ఎవరితో చర్చించకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటర్ విద్యా వ్యవస్థలో జోక్యం చేసుకోవడంతో కాంగ్రెస్ పతనం ప్రారంభమయ్యింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. రేవంత్‌రెడ్డిని గద్దె దించేవరకు పోరాటం కొనసాగిస్తాం.