హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్‌లో ఇటీవల జరిగిన రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ బూటకమని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆరోపించింది. నేర స్వభావం కలిగిన రియాజ్‌ను పోలీసులు కస్టడీలోనే చంపేసి, దవాఖానలో ‘ఎన్కౌంటర్’ కట్టుకథ అల్లారని కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్‌కుమార్ హత్య అనంతరం రియాజ్‌ను పట్టుకునేందుకు పోలీసులు అతడి కుటుంబ సభ్యులపై కర్కశత్వం ప్రదర్శించారని ఆరోపించారు. అతడి భార్యపై, తల్లిపై లైంగిక హింసకు పాల్పడ్డారని తెలిపారు. ప్రమోద్ హత్య మొదలు రియాజ్ ఎన్కౌంటర్ వరకు మొత్తం నకిలీ నోట్ల చుట్టే తిరిగిందని వెల్లడించారు.
ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రమోద్‌కుమార్‌ను కత్తితో పొడిచి చంపాడనే కారణంతో రౌడీషీటర్ రియాజ్‌ను ఎన్కౌంటర్ చేయడంపై ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ ప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లి అధ్యయనం చేశారు. పదిరోజులపాటు తాము సేకరించిన విషయాలను ఓ నివేదిక రూపంలో సిద్ధంచేశారు. శుక్రవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు (న్యాయవాదులు, పౌరహక్కుల నేతలు) ఖలీదా పర్వీన్, సారా మాథ్యూస్, మాజిద్ షుట్టారి, అడ్వకేట్ సమీర్ అలీ, మహ్మద్ అబ్దుల్లా తాజ్, షేక్ సికందర్ మీడియాతో మాట్లాడారు.
అంతా.. రూ.3 లక్షల నగదు చుట్టే
కానిస్టేబుల్ ప్రమోద్‌కుమార్ హత్య, రియాజ్ ఎన్కౌంటర్ మొత్తం రూ.3 లక్షల నకిలీ నోట్ల చుట్టే తిరిగిందని తమ విచారణలో తేలినట్టు కమిటీ తెలిపింది. నివేదిక ప్రకారం.. రియాజ్ ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. పనిలో భాగంగా ఒకరోజు ఆసిఫ్ అనే వ్యక్తి సూటీని జప్తు చేశాడు. ఆ సూటీలో రూ.3 లక్షలు కనిపించాయి. తీరాచూస్తే అవి దొంగ నోట్లు అని తేలింది. ఈ నకిలీ నోట్లను మార్చుకునేందుకు రియాజ్ పలువురి దగ్గర ఆన్లైన్లో అప్పు తీసుకొని, వారికి నోట్లు ఇచ్చి బాకీ చెల్లించాడు. ఇలా దాదాపు రూ.2 లక్షల వరకు నకిలీ నోట్లను మార్చుకున్నాడు. ఆ డబ్బుతో ఒక బైక్ కొన్నాడు. ఒకరోజు ఆసిఫ్ వచ్చి తన బండిని, అందులో ఉన్న రూ.3 లక్షలు ఇవ్వాలని, లేకపోతే అతని కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు.
దీంతో రియాజ్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. సాయం కోసం కానిస్టేబుల్ ప్రమోద్ను సంప్రదించి, తనను కాపాడాలని వేడుకున్నాడు. దీంతో ప్రమోద్ అతడిని ఒక ఉన్నతాధికారి వద్దకు తీసుకెళ్లగా, అతను రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. మొత్తం ఖర్చయిందని, తాను అంత డబ్బు ఇవ్వలేనని రియాజ్ చెప్పాడు. దీంతో రియాజ్‌ను ఎరగా వేసి నకిలీనోట్ల ముఠాను పట్టుకోవాలని పోలీసులు ప్లాన్ వేశారు. మరి.. నకిలీ నోట్లు దొరికినట్టుగా చెప్తున్న స్కూటర్‌ను పోలీసులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. దర్యాప్తులోనూ స్కూటర్‌ను సాక్ష్యంగా చూపలేదన్నారు. పోలీసులు రియాజ్‌ను విలన్‌గా, ఆసిఫ్‌ను హీరోగా చూపెట్టాలనే కోణంలోనే ఆలోచించారని ఆరోపించారు. తద్వారా నకిలీనోట్ల రాకెట్‌ను దాచిపెట్టారా? అనే అనుమానాలొస్తున్నాయని చెప్పారు.
రియాజ్‌ను చంపేందుకు ఆసిఫ్ గ్యాంగ్ ప్లాన్
రౌడీషీటర్ రియాజ్ పోలీసులకు ఇన్ఫార్మర్గా మారాడని ఆసిఫ్ గ్యాంగ్ అనుమానించిందని కమిటీ తమ నివేదికలో తెలిపింది. దీంతో అతన్ని చంపేందుకు ఆసిఫ్ గ్యాంగ్ నిర్ణయించుకున్నది. ఈ నేపథ్యంలో రూ.లక్ష లంచం ఇస్తే ఆసిఫ్ గ్యాంగ్ నుంచి కాపాడతామని రియాజ్‌కు స్థానిక పోలీసులు మరోసారి ఆఫర్ ఇచ్చారు. స్థానికుల సమాచారం ప్రకారం అక్టోబర్ 17న రియాజ్, ప్రమోద్ రహస్యంగా ఒక ప్రాంతంలో కలుసుకొని లంచం గురించి చర్చించుకున్నారు. ఈ విషయం తెలిసి రియాజ్‌ను చంపేందుకు ఆసిఫ్ గ్యాంగ్ వచ్చారు. అయితే, ఆసిఫ్ గ్యాంగ్ దాడి నుంచి రియాజ్ తప్పించుకోగా, కానిస్టేబుల్ ప్రమోద్ మరణించాడు.
అతడి మృతదేహాన్ని నిజామాబాద్‌లోని వినాయకనగర్‌లో రోడ్డుపై పడేశారు. అయితే, పోలీసులు మాత్రం ప్రమోద్ను రియాజ్ కత్తితో పొడిచారని ప్రకటించారు. ఈ క్రమంలో ప్రమోద్ మేనల్లుడు ఇచ్చిన వాంగ్మూలంపై కమిటీ అనుమానాలు వ్యక్తంచేసింది. ప్రమోద్ బైక్ నడుపుతుంటే రియాజ్ మధ్యలో ఉన్నాడని, అతడి మేనల్లుడు వెనుక కూర్చున్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో రియాజ్ కత్తి తీసుకొని ముందుగా ప్రమోద్ ఛాతీపై, ఆ తర్వాత అతడి మేనల్లుడి తొడపై పొడిచాడని చెప్తున్నారని, ఇలా చేయడం అసాధ్యమని కమిటీ అభిప్రాయపడింది. ప్రమోద్ను హత్యచేసినట్టు చెప్తున్న కత్తిని పోలీసులు ఇప్పటివరకు రికవరీ చేయలేదని, వారి కుటుంబసభ్యుల స్టేట్మెంట్ను తీసుకోలేదని చెప్పారు.
దవాఖానలో నాటకం?
ఈ విషయం తెలిసి రియాజ్ అక్టోబర్ 19న స్వచ్ఛందంగా లొంగిపోయాడని కమిటీ తమ నివేదికలో తెలిపింది. కానీ పోలీసులు దీనిని ఎక్కడా రికార్డు చేయలేదని పేర్కొన్నది. ప్రమోద్ను తానే హత్య చేశానని ఒప్పించడానికి పోలీసులు రియాజ్‌ను చిత్రహింసలు పెట్టారని, దీంతో రియాజ్ కస్టడీలోనే మరణించాడని కమిటీ అనుమానిస్తున్నది. రియాజ్‌ను లారీలో పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. అయితే, రియాజ్ నిజంగానే హత్యచేసి ఉంటే ఇతర పట్టణాలకు ఎందుకు పారిపోలేదన్నది కమిటీ ప్రశ్న. పైగా పోలీసులు చెప్పిన లారీ పూర్తిగా ధ్వంసం అయ్యిందని, క్యాబిన్ మాత్రమే ఉన్నదని, దానిలో కూర్చోలేనంత అసౌకర్యంగా ఉన్నదని, అలాంటి స్థలంలో రియాజ్ ఎలా దాక్కుంటాడని ప్రశ్నిస్తున్నారు. దవాఖానలోకి రియాజ్‌ను తీసుకెళ్లడం, కాల్పుల వీడియోలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తున్నా రు. రియాజ్ బతికి ఉంటే ఎమర్జెన్సీ వార్డ్‌కు ఎందుకు తీసుకెళ్లలేదన్నది మరో ప్రశ్న.
కుటుంబ సభ్యులకు చిత్రహింసలు
పోలీసులు రియాజ్‌ను పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించి, సమాచారం ఇస్తే రూ.50 వేలు బహుమతి ఇస్తామని ప్రకటించారని కమిటీ వెల్లడించింది. మరోవైపు, రియాజ్‌ను వెతికే ప్రక్రియలో భాగంగా పోలీసులు అతడి కుటుంబాన్ని అక్టోబర్ 17వ తేదీ రాత్రి నుంచి 19వ తేదీ ఉదయం వరకు అక్రమంగా నిర్బంధించారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. అతని భార్య, తల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ప్రైవేట్ భాగాల్లో కారంపొడి చల్లారని, మైనర్ పిల్లలను కూడా చిత్రహింసలు పెట్టారని కమిటీ సభ్యులు మీడియాకు తెలిపారు.