హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): సచివాలయంలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ‘ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్’ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం సర్క్యులేటింగ్ ఆఫీసర్లకు (డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ) కూడా వర్తించనున్నది. సీఎస్ శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 22వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఉద్యోగులు ఆఫీస్‌లోకి వచ్చేటప్పుడు, వెళ్లేసమయంలో కచ్చితంగా అటెండెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
నూతన అటెండెన్స్ విధానంపై సచివాలయ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఉద్యోగులతోనో, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతోనో ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులంతా సమానమే అయితే.. ఏఐఎస్ అధికారులకు కూడా దీనిని వర్తింపజేస్తారా? అని అడుగుతున్నారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి.. ఇప్పుడు మాత్రం నియంతృత్వ ధోరణితో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు.