హైదరాబాద్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): సివిల్ సప్లయ్ శాఖలో ఉద్యోగులందరినీ ఓ కీలక అధికారి హడలెత్తిస్తున్నారు. దీంతో ఉద్యోగులందరూ భయం గుప్పిట్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఉద్యోగి కదలికపై ప్రత్యేక నిఘా పెట్టినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కిందిస్థాయి అధికారుల, ఉద్యోగుల ప్రతి అడుగును నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా చర్చ జరుగుతున్నది. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు.. ఇలా ప్రతి అడుగుపై నిఘా పెట్టినట్టు ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగులందరి చిట్టా మొత్తం ఆ అధికారి చేతిలో నిక్షిప్తమై ఉన్నట్టు తెలిసింది. కనీసం ఫోన్ కాల్ మాట్లాడేందుకూ జంకుతున్నారు. వాట్సాప్ కాల్స్తోనే నెట్టుకొస్తున్నారు. ఇలా సివిల్ సప్లయ్ ఉద్యోగులపై నిఘా నేత్రం పని చేస్తున్నట్టు శాఖలో జోరుగా చర్చ జరుగుతున్నది. దీంతో సదరు అధికారిని చూస్తేనే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.
పెదవులపై నవ్వు.. కడుపులో కత్తి!
సివిల్ సప్లయ్ శాఖలో ఆ కీలక అధికారి వ్యవహారశైలిపై అదే శాఖలోని ఓ ఉద్యోగి ఇలా స్పందించడం గమనార్హం. ‘పెదవులపై నవ్వు.. కడుపులో కత్తి’ పెట్టుకుని ఉంటారని ఆ ఉద్యోగి వ్యాఖ్యానించడం ఆ శాఖలో పరిస్థితికి అద్దం పడుతున్నది. సదరు అధికారి చెప్పినట్టు విని, తిడితే పడిన వారికి అందలం దక్కుతుందని, ఏ మాత్రం ఎదురు మాట్లాడినా ఇక అంతే సంగతని చెప్తున్నారు. ఇటీవల ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో తన మాట వినని ఓ ఉద్యోగిని ఏకంగా ఓ జిల్లాకు బదిలీ చేసినట్టుగా తెలిసింది. సంస్థకు సంబంధించిన ఏ సమాచారం కూడా తనకు తెలియకుండా బయటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. ఒకవేళ ఏదైనా ఒక విభాగానికి సంబంధించిన సమాచారం బయటకు వెళ్లిందా.. ఆ శాఖ ఉద్యోగులకు మూడినట్టేనని చర్చ జరుగుతుంది. ఆ సమాచారం వేరే విధంగా బయటకు వెళ్లినా, ఆ విభాగం ఉద్యోగులనే బాధ్యులను చేస్తున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు.
పెద్దగా అరుస్తారు.. కోపంతో ఊగిపోతారు!
సివిల్ సప్లయ్ శాఖలోని ఆ కీలక అధికారి ఇష్టారీతిన దుర్భాషలతో వేగలేకపోతున్నామని కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులు పలువురు ఆవేదన చెందుతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఉద్యోగులపై దుర్భాషలతో విరుచుకుపడుతారని పేర్కొంటున్నారు. పైఅధికారి కావడంతో చచ్చినట్టు భరించాల్సి వస్తున్నదంటూ తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. చిన్న విషయాలకు, చిన్నపాటి తప్పులకు పెద్దగా ఆరుస్తూ, కోపంతో ఊగిపోతూ.. ఇష్టారీతిన తిడుతుంటారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తోటి ఉద్యోగుల ముందే అవమాన పరుస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఏ ఒక్క అధికారి నుంచి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇన్ని అవమానాలు, ఇన్ని బెదిరింపులు ఎప్పుడూ చూడనే లేదంటూ చెప్తు న్నారు. ఆఫీసులో ఒకరిద్దరు అధికారులకు ఆ అధికారి పెత్తనం అప్పగించడంపైనా ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.