Telangana | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా గత రెండు, మూడు రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షానికి వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. గుండిలో శుక్రవారం ఉదయం 8:30 గంటల వరకు అత్యధికంగా 213.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం అని అధికారులు వెల్లడించారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పుదురి గ్రామంలో 160 మి.మీ., గంగాధరలో 158.8 మి.మీ., బూరుగుపల్లిలో 143.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వేములవాడ శివార్లలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్‌తో పాటు పలు చోట్ల రోడ్లపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం కోనాపూర్ సమీపంలో భారీ వరద కారణంగా నిర్మాణంలో ఉన్న రోడ్డు కొట్టుకుపోయింది. ధర్మపురి వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులకు పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. స్నానాల కోసం నది లోతులోకి వెళ్లొద్దని సూచించారు.