ఇటీవల మేడిపల్లిలో 5 నెలల గర్భిణి స్వాతిని ఆమె భర్త మహేందర్‌రెడ్డి ముక్కలుగా నరికి.. మూసీ నదిలో పడేశాడు. ప్రేమించి పెళ్లాడిన భాగస్వామిని కడతేర్చి.. జైలుపాలయ్యాడు.
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి రమేశ్, నిహారిక భార్యాభర్తలు. నిహారిక భర్త పేరు మీదున్న రూ.8 కోట్ల ఆస్తిని కొట్టేయాలని ప్రియుడితో ప్లాన్ చేసింది. భర్తను కారు లో భువనగిరి శివారుకు తీసుకెళ్లి హత్యచేసింది. హర్యానాకు చెందిన రాణా సాయ ంతో ఊటీ కాఫీ ఎస్టేట్‌లో దహనం చేసింది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చెన్నయ్య, రజిత దంపతులకు ముగ్గురు పిల్లలు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లిన రజిత.. తన పాత ఫ్రెండ్ శివకుమార్‌ను కలుసుకుంది. ప్రియుడితో జీవించాలని భర్త, పిల్లలకు పెరుగులో విషమిచ్చి చంపింది. చెన్నయ్య భోజనం చేయకపోవడంతో బతికిపోయాడు.
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘ధర్మేచ, అర్థేచా, కామేచా.. నాతి చరామి’ అంటూ చేసిన ప్రమాణాలను మర్చిపోతున్న దంపతులు.. ఒకరినొకరు కడతేర్చుకుంటున్నారు. పవిత్రంగా, సురక్షితంగా భావించిన వివాహ బంధాలు బలహీనమై, విషాదాలు జరుగుతున్నాయి. వివాహేతర బంధాలు.. హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. రెండేండ్లలో పలు కుటుంబాల్లో జరిగిన ఘర్షణలు విషాదాంతమయ్యాయి. ఈ పరిణామాలు తీవ్ర ఆందోళనకరంగా మారాయని మానసిక విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
వివాహేతర బంధాలతోనే విషాదం
కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వివాహేతర బంధ ం. దంపతుల్లో ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గడం మరొకరితో బంధం కొనసాగిస్తున్న క్రమం లో హత్యలు జరుగుతున్నాయని సర్వేలు చె ప్తున్నాయి. ఇతరులతో బంధాలు ఏర్పర్చుకోవడంతో విడాకులు పెరుగుతున్నాయని, హత్యలకు దారితీస్తున్నాయని చెప్తున్నారు.
దాంపత్యంలో సమస్యలు-కారణాలు
బలైపోతున్న బాలల భవితవ్యం
ఆర్థిక సమస్యలు లేదా వివాహేతర బంధాలు దంపతుల మధ్య సమస్యలు తలెత్తి, ఘర్షణలకు దారితీస్తున్నాయి. ఈ పరిణామాలతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నది. అభంశుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోయేలా చేస్తున్నది. కొన్ని ఘటనల్లో తల్లి, మరికొన్ని ఘటనల్లో తండ్రి.. తమ వివాహేతర బంధాలకు అడ్డొస్తున్నారని పిల్లలను చంపుతున్నారు. కొందరు హత్య, ఆత్మహత్యకు పాల్పడటం వల్ల పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తల్లిదండ్రుల మధ్య సమస్యలు.. పిల్లల భద్రతకు ముప్పుగా మారుతున్నదని సైకాలజిస్టులు చెప్తున్నారు.
అర్థం చేసుకోవడమే అనర్థాలకు పరిష్కారం
భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూనే సగం సమస్యలకు చెక్ పెట్టొచ్చు. నమ్మకం లేనిచోట అనుమానం పెరుగుతుంది. మారిన జీవన విధానంలో ఒకరికొకరు కట్టుబడి ఉండి.. ఊసులు చెప్పుకునే పరిస్థితి లేదు. భర్తనో, భార్యనో, పిల్లలనో అడ్డు తొలగించుకునే ఆలోచన చేస్తున్నారు. ఫోన్లు పక్కన పెట్టి మాట్లాడుకోవాలి. పరస్పరం గౌరవించుకోవాలి. చిన్నచిన్న ఆనందాలను వెతుక్కోవాలి… భాగస్వామికి అందివ్వాలి. జీవిత లక్ష్యాలను ఏర్పుచుకోవాలి. విపరీతమైన కోరికలు, ఆలోచనలు ఉంటే.. సైకాలజిస్టులను సంప్రదించాలి.
– డాక్టర్ అనంత్‌కుమార్, సైకాలజిస్టు
మహిళలు, ఎస్సీ, ఎస్టీల పట్ల పెరిగిన నేరాలు
రాష్ట్రంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు పెరిగాయి. 2023తో పోల్చితే 2024 డిసెంబర్ వరకు మహిళల హత్యలు 13.15శాతం పెరిగాయి. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు 363 పెరిగాయి. మొత్తంగా మహిళలపై దాడులు, వేధింపులు 4.78 శాతం పెరిగాయని గణాంకాలు చెప్తున్నాయి. 2024 రాష్ట్ర క్రైమ్ నివేదిక ప్రకారం కుటుంబ వివాదాల్లో 229 హత్యలు జరిగాయి. నగదు వివాదాల్లో 53, లైంగిక కారణాలతో 102, భూ వివాదాల్లో 82, చిన్నపాటి గొడవల వల్ల 82, ఇతర కారణాల వల్ల 259 హత్యలు చోటు చేసుకున్నాయి.