హైదరాబాద్ : నగరంలోని అఫ్జల్‌గంజ్ పరిధి గౌలిగౌడలో పేలుడు కలకలం సృష్టించింది. రసాయనాలను నాలాలో పోస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో కొడుకు మృతి చెందగా.. అతని తండ్రితో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా పేలుడు జరుగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ప్రమాదంలో భరత్ అనే వ్యక్తి మృతి చెందగా.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
గాయపడ్డ వేణుగోపాల్‌ను దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భరత్ కెమికల్స్ వ్యాపారం చేస్తుండగా.. కాలం చెల్లిన కెమిల్స్ను ఇంటి ఎదుట ఉన్న నాలాలో పారబోస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం సైతం భరత్ కెమికల్స్‌ను నాలాలో పారపోశాడు. ఆ తర్వాత నాలాలో ఇనుప చువ్వ సహాయంతో రసాయనాలను కదిలించాడు. దీంతో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకున్నది. పేలుడు ధాటికి భరత్ ఎగిరిపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని తండ్రి వేణుగోపాల్‌తో పాటు మరో వ్యక్తి గాయాలయ్యాయి. పేలుడు ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.